
‘హీరాకుడ్’ పర్యాటకులకు ఆంక్షలు
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా సంబలపూర్ హిరాకుడ్ ఆనకట్ట వద్ద భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచి చర్యలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆనకట్ట ప్రాంగణంలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు కీలకమైన ప్రవేశ కేంద్రాల వద్ద నోటీసులు జారీ చేశారు. ఉత్తర్వుల అమలుకు ఆయా కేంద్రాల్లో పోలీసు సిబ్బందిని మోహరించారు. సంబలపూర్ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర కేంద్ర భద్రతా సంస్థల సమన్వయంతో ఉన్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్‌ను ప్రారంభించింది. విపత్కర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందన కోసం లైట్ మెషిన్ గన్ (ఎల్‌ఎంజీలు) సహా ఆధునిక సాయుధ దళాలను మోహరించారు. ఆసియాలోనే అతి పొడవైన మట్టి ఆనకట్ట, భారీ నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి , వరద నియంత్రణకు కీలకమైన నీటి నిల్వ అయిన హిరాకుడ్ ఆనకట్టపై ఆగంతకుల దృష్టి కేంద్రీకృతమై ఉండే అవకాశం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సందర్శకులను పరిమితం చేస్తున్నారు.