
పికప్ వ్యాన్ బోల్తా
● పది మందికి గాయాలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మంజూరికుఫా వద్ద గురువారం ఒక పికప్ వ్యాన్ బోల్తా పడింది. ఘటనలో పది మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలకు గురైన మరి కొంతమందికి సమీపంలో గల భవాణీపట్నంకు తరలించారు. ప్రమాదానికి కారణమైన పికప్ వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... వీధివీధుల్లో తిరిగి గాజులు,పూసలు వంటి చిరువ్యాపారాలు చేసుకునే 20 మంది గురువారం ఉదయం అంబొదల నుంచి మునిగుడ వరకు వెళ్లేందుకు అటువైపుగా వస్తున్న పికప్ వ్యాన్ ఎక్కారు. మంజూరికుఫా ప్రాంతానికి వ్యాన్ వచ్చే సరికి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికుల్లో 10 మంది గాయాలకు గురయ్యారు. వీరంతా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన బలరాంపూర్ జిల్లా రాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.