
ఈకోర్సా ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్
భువనేశ్వర్: భారత సాంకేతిక సంస్థ (ఐఐటీ) భువనేశ్వర్ సహకారంతో తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం (ఈకోర్సా) ఖుర్దారోడ్ శాఖ ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్ 2025 నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం జూన్ 1, 2025 ఆదివారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐఐటీ భువనేశ్వర్ నుంచి యూ టర్న్‌తో రైల్వే స్టేడియం వద్ద ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వర్గాలు 15 నాటికి వివరాలు నమోదు చేసుకోవాలని ఈకోర్సా ఉపాధ్యక్షుడు పీకే బెహరా తెలిపారు. ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి (డీఆర్‌ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హాఫ్ మారథాన్ సంబంధిత వివరాల్ని వెల్లడించారు. పుష్కలమైన ఆరోగ్యం, సామాజిక బంధం ప్రోత్సహించే దిశలో అన్ని వర్గాల ఔత్సాహికులకు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తున్నారు. నాలుగు వర్గాల కింద మారథాన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ వర్గాల్లో విజేతలకు నగదు బహుమతులు ప్రకటించారు. 21.1 కిలో మీటర్ల హాఫ్ మారథాన్‌లో పురుష – సీ్త్ర విభాగాలకు వయస్సు ఆధారంగా వరుసగా రూ. 12000, రూ. 9000, రూ. 6000 నగదు బహుమతులు, 10 కిలో మీటర్ల పరుగు విభాగంలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు రూ. 10,000, 7000, రూ.5000 నగదు బహుమతులు అందజేస్తారు.