భువనేశ్వర్: జగన్నాథ యాత్ర కోసం రథాల తయారీ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఇందులో భాగంగా రథాల తయారీ పనులు చురుకుగా సాగుతున్నాయి. భారీ దూలాల్ని వడ్రంగుల మార్గదర్శకంలో అనుకూలమైన కొలతల ప్రకారం కోసి సకాలంలో అందజేస్తున్నారు. వీటితో రథ చక్రాల తుంబల తయారీ ముందుకు సాగుతుంది. రథాల తయారీ నాలుగో రోజున 38 మంది మహారణ (వడ్రంగి) సేవకులు, నలుగురు రంపం కోత కార్మికులు, ఆరుగురు కమ్మరి సేవకులు, 19 మంది భోయ్ సేవకులతో నీటి పంపిణీ కోసం ఒక సహాయకునితో 68 మంది ఈ పనుల్లో సమగ్రంగా పాలుపంచుకున్నారు. నాలుగో రోజు రథ నిర్మాణం పనులు ముగిసే సరికి మూడు రథాల కోసం మొత్తం 28 తుంబల ప్రాథమిక పనులు పూర్తి చేశారు.
ప్రత్యక్ష పర్యవేక్షణ
స్వామి యాత్ర కార్యకలాపాలు ఆద్యంతాలు అత్యంత జాగరూకతతో నిర్వహిస్తారు. చక్రంలో కీలక భాగమైన తుంబ తయారీలో ప్రధాన మహరణ సేవకులు ప్రత్యక్షంగా కలప నాణ్యతని లోతుగా సమీక్షిస్తున్నారు. వీరి సమీక్ష ఆధారంగా ఎంపికై న దూలాల్ని మాత్రమే రంపం కోత కార్మికులు తదుపరి తయారీ కార్యకలాపాల కోసం సిద్ధం చేస్తున్నారు.
పనుల్లో వండ్రంగులు నిమగ్నం
భువనేశ్వర్: జగన్నాథుని యాత్రకు రథాల తయారీ పనులు అంచెలంచెలుగా పుంజుకుంటున్నాయి. అక్షయ తృతీయ పురస్కరించుకుని ప్రారంభమైన పనులు వడ్రంగి వర్గం తొలుత చేపట్టారు. ఈ వర్గం పనులు ఒక దశకు రావడంతో అనుసంధాన కార్యకలాపాల కోసం కమ్మరి వర్గం రంగ ప్రవేశం చేసింది. శ్రీమందిరం బొడొ దండొ ప్రాంగణంలో రథాల తయారీ ఛాయా శిబిరం పని చేస్తుంది. ఈ ప్రాంగణంలో వడ్రంగి పనులు కొనసాగుతున్నాయి. కమ్మరి కార్యకలాపాల కోసం శ్రీ మందిరం పరిసరాల్లో డోల వేదిక పరిసరాల్లో తాత్కాలిక కమ్మరి శాల ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి కార్మికులు కమ్మరి కార్యకలాపాలకు హాజరు అవుతున్నారు. మూడు రథాల ప్రధాన ఓఝా (కమ్మరి) సేవకుల్ని ప్రత్యేకంగా సత్కరించి ఈ పనుల్ని ప్రారంభించారు. తొలి రోజున ప్రతి చక్రానికి అవసరమైన 6/7 అంగుళాల పరిమాణంతో మేకులు తయారీ పనులు ప్రారంభించారు.
రథోత్సవానికి సన్నాహాలు
రథోత్సవానికి సన్నాహాలు