
జగన్నాథ రథ చక్రాల్..
వస్తున్నాయ్ వస్తున్నాయ్..
జగన్నాథుని రథోత్సవానికి సన్నాహాలు
● మహంతులతో ఎస్పీ సమావేశం
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథా యాత్ర కోసం అనుబంధ యంత్రాంగం ఒక్కోటిగా సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం ముందంజలో ఉంది. యాత్ర పురస్కరించుకుని అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు విభాగం ప్రధానంగా జాగ్రత్త వహిస్తుంది. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల్లో క్రమశిక్షణ ప్రేరేపించి అవసరమైన సహాయ సహకారాలు సకాలంలో అందజేయాలని అభ్యర్థిస్తుంది. స్వామి యాత్ర నిర్వహణలో స్థానిక మఠాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మఠాల అధిపతుల ఆధ్వర్యంలో యాత్ర కార్యకలాపాలు నిర్విఘ్నంగా సకాలంలో నిర్వహించేందుకు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పూరీ పట్టణ వ్యాప్తంగా శ్రీ జగన్నాథుని సంస్కృతితో ముడి పడిన మఠాల మహంతలతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన తొలి సమన్వయ కమిటి సమావేశం తీర్మానాలపై అవగాహన కల్పించారు.
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ చురుగ్గా సాగుతోంది. వడదెబ్బ తాకిడి నుంచి జాగ్రత్త వహిస్తూ ఈ పనుల్లో కార్మికులు నిరవధికంగా పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచే పనులకు హాజరవుతున్నారు. కార్మికులపై ఒత్తిడి తగ్గించే దిశలో పనులు పుంజుకుంటున్న కొద్దీ కార్మికుల సంఖ్యని పెంచుతున్నారు. గడిచిన 3 రోజుల్లో రథ చక్రాల తుంబల తయారీలో వడ్రంగి (మహరణ) కార్మికులు తలమునకలై ఉన్నారు. ఈ దశ పనుల్లో రంపం కార్మికుల పాత్ర కీలకం. కోతకు వీలుగా భారీ దుంగల్ని చెక్కి తుంబల తయారీకి అనుకూలంగా మలచి ప్రధాన వడ్రంగి సేవకులకు అందజేస్తున్నారు. ఈ పనుల కోసం నియమితులైన 26 మంది వడ్రంగి (మహరణ) సేవకులు, నలుగురు రంపం కార్మికులు, ఆరుగురు కమ్మరి కార్మికులు, 14 మంది బోయి సేవకులు, ఒక సహాయకునితో మొత్తం 51 మంది కార్మికులు మూడు రథాలకు అవసరమైన 42 తుంబల తయారీ పనులు ప్రారంభించారు.