నెల్లిమర్ల: పట్టణంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. కొండపేట, థామస్‌పేట ప్రాంతాలతో పాటు చంపావతి నదీ తీరంలో కమెడియన్లు వెన్నెల కిశోర్, జబర్దస్త్ కమెడియన్ అప్పారావులపై కొన్ని సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ వాసులు, చుట్టుపక్కల గ్రామస్తులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. వారు కూడా తమ అభిమానులతో సెల్ఫీలు దిగి, ఆనందం వ్యక్తం చేశారు.
పూరిల్లు, పశువుల శాల దగ్ధం
దత్తిరాజేరు: షార్ట్‌సర్క్యూట్ కారణంగా మండలంలోని ఎం. లింగాలవలస గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో పూరిల్లు, పశువుల శాల దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో పాడిరైతు మజ్జి కృష్ణకు చెందిన మూడు ఆవులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయంపై గజపతినగరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చామని గ్రామస్తులు తెలిపారు.
ఆటో బోల్తా: విద్యార్థి మృతి
రామభద్రపురం: ఆటో బోల్తాపడిన దుర్ఘటనలో విద్యార్థిని అఖిల(8) దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం మండలంలోని బూసాయవలస వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ పట్నాన లక్ష్మణ తన ఆటోలో షికారుకు అని, తన అన్నయ్య శంకరరావు కూతురు అఖిల, కొడుకును తీసుకుని ప్రయాణమయ్యా డు. సరిగ్గా బూసాయవలస వద్ద చర్చికి సమీపంలో ఆటో తిప్పుతుండగా అదుపు తప్పి, బోల్తాపడింది. దీంతో తీవ్రగాయాలపాలైన అఖి లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేంద్ర నాయుడు తెలిపారు.
ఆగంతుకుడి చేతిలో
గాయపడిన మహిళ మృతి
కొత్తవలస: ఆగంతుకుడి చేతిలో తీవ్రంగా గాయపడి, విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మాదాబత్తుల సూర్యకాంతం(56) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు సీఐ ఎస్.బాలసూర్యారావు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని కుమ్మరి వీధిలో నివాసముంటున్న సూర్యకాంతం ఇంట్లోకి ఓ ఆగంతుకుడు చొరబడి, ఆమె కళ్లల్లో కారం కొట్టి, తలపై ఓ పదునైన ఆయుధంతో బలంగా మోది గాయపరిచాడు. అనంతరం ఆమె మెడలోని 3 తులాల పుస్తెలతాడు, చెవిదిద్దులు తీసుకుని పరారయ్యాడు. భోజనం కోసమని ఇంటికి చేరుకున్న ఆమె కొడుకు గణేష్ రక్తపుమడుగులో ఉన్న తల్లిని చూసి కన్నీరుమున్నీరై, చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అయితే తెల్లవారుజామునే ఆమె చనిపోయినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే క్లూస్ టీమ్, డీఎస్పీ ఘటన స్థలాన్ని క్షుణ్నంగా పరిశీలించారని తెలిపారు.
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
నెల్లిమర్ల: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వ హించారు. నెల్లిమర్ల, విజయనగరం, కొత్తవలస, గంట్యాడ, గజపతినగరం, బొబ్బిలి ప్రాంతాల్లోని పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షకు 1061 మంది విద్యార్థులు హాజరయ్యారు. 89 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు గురుకులాల జిల్లా కన్వీనరు డాక్టర్ కేబీబీ రావు తెలిపారు. నెల్లిమర్ల బాలికల పాఠశాలలో 191 మందికి 174 మంది, మత్స్యకార బాలుర పాఠశాలలో 19 మందికి 18 మంది, విజయనగరం పాఠశాలలో 90 మందికి 76 మంది, కొత్తవలస పాఠశాలలో 280 మందికి 251 మంది, గజపతినగ రం పాఠశాలలో 145 మందికి 139 మంది, బొబ్బిలి పాఠశాలలో 227 మందికి 211 మంది, గంట్యాడ పాఠశాలలో 199 మందికి 183 మంది హాజరైనట్లు చెప్పారు.
మృతి చెందిన అఖిల
షూటింగ్‌లో పాల్గొన్న కమెడియన్ వెన్నెల కిశోర్


