ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించొద్దు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు ఏకగ్రీవ తీర్మానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. మంగళవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ‘ప్రైవేటు విద్యుత్ బస్సులు–ఆర్టీసీ–ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జిలాని బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయత్యుత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నేతలు నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. జీసీసీ పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యుత్ ప్రైవేటు బస్సుల వల్ల ఆర్టీసీ డిపోలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపోలను, విలువైన స్థలాలను, బస్ స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పనంగా అప్పజెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకిస్తే ప్రజలపై భారం పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగు ణంగా ఆర్టీసీ బస్సులు పెంచాలని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వి.ఎస్.రావు, నేషనల్ మజ్దూర్ యూనిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాజేష్ కుమార్, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ.. ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాలు అన్నీ ఐక్యంగా పోరాడితేనే ఈ ప్రైవేటు విద్యుత్ బస్సుల ప్రమాదం నుంచి ఆర్టీసీని రక్షించుకోగలమని పేర్కొన్నారు.
అనంతరం సదస్సులో ‘విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీనే నడపాలి’ అని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యుత్ బస్సులపై రూపొందించిన బుక్‌లెట్‌ను సదస్సు ఆవిష్కరించింది. సదస్సులో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


