పనులు చేసినా పస్తులేనా? మూడు నెలలుగా అందని ద్రవ్యం ప్రత్యామ్నాయ పనుల వైపు కూలీల మొగ్గు ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలంటూ సిబ్బందిపై ఉన్నతాధికారుల ఒత్తిడి
‘ఉపాధి’ ఇలా..
మూడు నెలలుగా ఇవ్వకపోతే ఎలా?
వేతనాలు ఇవ్వకపోతే పనులు ఎలా చేయాలి
ఉపాధి హామీ కూలీలు వేతన వేదన అనుభవిస్తున్నారు. పనులు చేసినా మూడు నెలలుగా వేతనాలు అందక పస్తులు ఉండాల్సి వస్తోంది. ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడంతో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురవు తోంది. పనులు చేసిన పదిహేను రోజుల్లో చెల్లించాలని నిబంధనలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. దీంతో కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో మూడు నెలలకు రూ.8.15 కోట్ల వేతనాలు పెండింగ్
మూడు నెలలుగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ నెలలో వేతనాలు అందుతాయి. గత మూడు నెలల పెండింగ్ వేతనాలతో పాటు ఈ ఏప్రిల్ నెల జీతాలు కూడా అందేలా 2026–27 బడ్జెట్లో ప్రొవిజన్ ఇచ్చాం. పని చేసిన ప్రతి ఒక్కరికీ వేతనాలు వస్తాయి. ఎటువంటి సందేహాలు లేకుండా పనులకు హాజరు కావాలి.
–అరవపల్లి రాము,
డ్వామా పీడీ, ఎన్టీఆర్ జిల్లా
జి.కొండూరు: ఉపాధి హామీ కార్మికులు మూడు నెలలుగా వేతనాల వెతలు పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుతో వారికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పని చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. దీంతో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కూలీలు పస్తులను ఉండలేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపాధి పనులు టార్గెట్ పూర్తయ్యే అవకాశం లేక కూలీల సంఖ్యను పెంచాలంటూ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోగా అదనంగా ఉపాధి పనులకు కూలీలను తీసుకురావాలనే ఒత్తిళ్లపై కింద స్థాయి సిబ్బంది రగిలిపోతున్నారని తెలుస్తోంది.
రూ.8.15 కోట్ల వేతనాలు పెండింగ్
ఎన్టీఆర్ జిల్లాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2,80,956 పని దినాలకు రూ.8.15 కోట్ల వేతనాలను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. పథకం నిబంధనల ప్రకారం పదిహేను రోజులకోకసారి కూలీలకు వేతనాలను అందించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను ఇతర పనులకు చంద్రబాబు సర్కార్ బదిలీ చేయడంతో కూలీలకు చెల్లింపు ఆలస్యమవుతోందని విమర్శలు వస్తున్నాయి. వేతనాలు లేట్కావడంతో పని చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని ఉపాధి కార్మికులు భావిస్తున్నారు. అధిక వేతనం కూడా ఆశ చూపడంతో వ్యవసాయ పనుల వైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలీలు సక్రమంగా రాక ఉపాధి పనులు పెండింగ్ పడుతున్నాయి.
మూడు నెలలుగా ఉపాధి పనులు చేస్తున్నా వేతనాలు ఇవ్వడం లేదు. వ్యవసాయ పనులకు వెళ్తే ఇంతకన్నా ఎక్కువే కూలీ వస్తుంది. వెంటనే డబ్బులు ఇస్తారు. ఈ పని ఎప్పుడూ ఉంటుందని వస్తే డబ్బులు అలస్యమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే వేతనాలను అందించాలి.
–యర్రంశెట్టి అప్పారావు, చెవుటూరు
ఉపాధి పనులకు వెళ్లినా ప్రయోజనం లేదు. పదిహేను రోజులకొకసారి ఇవ్వాల్సిన కూలి డబ్బులు.. మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం దారుణం. కూలి చేసుకుంటేనే పూట గడిచే ఎన్నో కుటుంబాలు నరకయాతన పడుతున్నాయి.
–యడ్లపల్లి తిరుపతమ్మ, చెవుటూరు


