డివైడర్ ఎక్కి బోల్తా కొట్టిన కారు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): డివైడర్ ఎక్కి కారు బోల్తా కొట్టిన ఘటన కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ వద్ద జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జి.కొండూరుకు చెందిన నాగభూషణం కారు డ్రైవర్. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతను మైలవరంలో సమీప బంధువులైన ఇద్దరు మహిళలను కారులో ఎక్కించుకుని కంకిపాడులో శుభకార్యానికి వెళ్లారు. అతను అక్కడే మద్యం సేవించాడు. తిరిగి సాయంత్రం బంధువులను కారులో ఎక్కించుకుని బెంజిసర్కిల్ నుంచి కృష్ణలంక హైవే మీదుగా మైలవరం బయలుదేరాడు. సుమారు సాయంత్రం 6.30 గంటలకు రాణిగారితోటలోని కోదండ రామాలయం సమీపానికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న అతను గుంటూరు వైపునకు వెళ్లే ప్లైఓవర్‌పైకి వెళ్లి డివైడర్‌ను ఎక్కించాడు. కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు సీట్‌బెల్టు ధరించడంతో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తీసి వివరాలు సేకరించారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.


