కన్నతల్లిని, జన్మభూమిని మరువకూడదు
గుడివాడ టౌన్: వునిషి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కన్న తల్లినీ, జన్మభూమినీ మరువ కూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నాట్స్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటించాలన్నారు. యువత ప్రకృతి సమతుల్యతను పాటించేందుకు ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలన్నారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తన జన్మభూమిని గుర్తు ఉంచుకుని గుడివాడలో 30 విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ భవాని శంకర్, డాక్టర్ పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


