21న పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: చిన్నారుల భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు తప్పక వేయించాలని కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ తెలిపారు. పోలియో నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో ఈ నెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని గురువారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు ఒక్క చిన్నారూ మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తమైందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,39,180 మంది ఉన్నట్లు అంచనా వేశామని వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 1,94,160 డోసులను సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమం విజయవంతానికి జిల్లాలో మొత్తం 4,898 మంది సిబ్బందిని నియమించామన్నారు.
పెనమలూరు: మద్యానికి బానిసగా మారిన వ్యక్తి బందరు కాలువలో దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్‌కు చెందిన దేవల దుర్గారావు(33) మట్టి పని చేస్తాడు. అతనికి భార్య మరియ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుర్గారావు మద్యానికి బానిసగా మారటంతో భార్య, పిల్లలు పుట్టింటికి ఐదు నెలల క్రితం వెళ్లి పోయారు. భార్య, పిల్లలు వెళ్లి పోవటంతో మనస్తాపం చెందిన దుర్గారావు విపరీతంగా మద్యం తాగడం ప్రారంభించాడు. కాగా బుధవారం దుర్గారావు యనమలకుదురు లాకుల వద్ద బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. కాలువలో అతని ఆచూకీ తెలియకపోవటంతో ఈ ఘటనపై తల్లి తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ెపదపారుపూడి: ఎదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొన్న ఘటనలో యవకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన పెదపారుపూడిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ రూరల్ మండలం కాశిపూడి గ్రామానికి చెందిన చప్పిడి అజయ్(24) గ్రామం నుంచి బైక్‌పై గుడివాడ పట్టణానికి వెళ్తుండగా పెదపారుపూడి గ్రామంలోని రామాలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు, బైక్‌ను ఢీకొనటంతో అజయ్ బైక్‌పై నుంచి కిందకు పడిపోయాడు. చిక్సిత నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే సొంత గ్రామానికి వచ్చాడు. మృతుడికి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఉన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): బీఫార్మసీ రెండు, మూడు సెమిస్టర్ల రెగ్యులర్ ఫలితాలను గురువారం సీఈ ఆలపాటి శివప్రసాద్ విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు ఫీజు రూ.2,070 చెల్లించాలన్నారు. అలానే వ్యక్తిగత పరిశీలనకు రూ.2,190 చెల్లించాలని సూచించారు.


