కొత్తగా ఎంపికై న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల ఎంపికై న 242 మంది కానిస్టేబుళ్లను ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించారు. వారికి తొమ్మిది నెలల పాటు ఇవ్వనున్న శిక్షణపై సోమవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు దిశానిర్దేశం చేశారు. జిల్లాకు కేటాయించిన 172 మంది పురుషులు, 70 మంది మహిళా కానిస్టేబుళ్లతో సమావేశమైన సీపీ శిక్షణా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. పోలీస్ ఉద్యోగం అనేది ఒక బాధ్యతతో కూడినదని, మీరు ఇక నుంచి ఎక్కడకు వెళ్లినా చాలా హుందాగా వ్యవహరించాలన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుందని, ఈ శిక్షణా కాలంలో శారీరక దృఢత్వంతోపాటు, టెక్నాలజీపై పూర్తి పట్టు సాధించాలని చెప్పారు. సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఈ శిక్షణా కాలంలో సాధించిన మార్కుల ఆధారంగానే పదోన్నతులు ఉంటాయన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులతో ముఖ్యంగా మహిళా బాధితులతో సామరస్యంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నూతన కానిస్టేబుళ్లకు టీ షర్ట్, కిట్‌ను అందించారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, ఏఆర్ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, ఎంపికై న కానిస్టేబుళ్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


