సమర్థంగా ధాన్యం కొనుగోళ్లు చేయాలి
అధికారులతో కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
కంకిపాడు: ధాన్యం కొనుగోళ్లు సమర్థంగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మండలంలోని పునాదిపాడు, కొలవెన్ను, ఉప్పులూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. శనివారం పునాదిపాడు, కోలవెన్ను రైతు సేవ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి, ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్న తీరును పర్యవేక్షించారు. స్థానిక రైతులు మాట్లాడుతూ తుపాను దెబ్బకు పంట దిగుబడులు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు లారీలను కలెక్టర్ బాలాజీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భావనారాయణ, వ్యవసాయ అధికారి ఉషారాణి, టెక్నికల్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: వ్యర్థాల నిర్వహణలో మెరుగైన విధానాలు అమలు చేయడానికి అన్ని విభాగాలు కట్టుబడి ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. సేఫ్ అండ్ సస్టైనబుల్ హైజీన్ ఫర్ ఆల్ (సాషా) పురస్కరించుకొని శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో విస్తృత స్థాయి శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో శుభ్రత ప్రమాణం చేయించారు. అనంతరం కార్యాలయంలోని అన్ని మరుగుదొడ్లను స్వయంగా పరిశీలించి, వాటి పనితీరు, శుభ్రతను సమగ్రంగా తనిఖీ చేశారు. మరమ్మతులు, నిర్వహణ అవసరాలను నమోదు చేసి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


