
కదనభేరి!
యూరియా కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై రైతన్నల కన్నెర్ర నందిగామ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన పోలీసులు అడ్డంకులు సృష్టించినా కొనసాగిన నిరసనలు ఆర్‌డీఓకు వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్ సీపీ నేతలు, అన్నదాతలు
రాష్ట్రంలో గూండా రాజ్యం: దేవినేని అవినాష్
కర్షకుడి పక్షాన వైఎస్సార్ సీపీ పోరు బాట
నందిగామ టౌన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో మంగళవారం నిర్వహించిన అన్నదాత పోరు విజయవంతం అయ్యింది. నందిగామలోని పార్టీ కార్యాలయం నుంచి సీఎం రోడ్డు, మునిసిపల్ కార్యాలయం గాంధీ సెంటర్ మీదుగా వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండి తోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, నల్లగట్ల స్వామిదాసు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ శైలజారెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆర్డీవో కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నందిగామ ఏసీపీ తిలక్ అక్కడకు చేరుకుని ముఖ్య నాయకులను మాత్రమే అనుమతిస్తామని రైతులు, నాయకులు, కార్యకర్తలను అనుమతించేది లేదని, సహకరించాలని సూచించారు. దీంతో ప్రధాన నాయకులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. జిల్లా లోని రైతులు పడుతున్న యూరియా సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు.
వివరాలిస్తామన్నా స్పందించటం లేదు..
యూరియా ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెట్‌లో ఉంది.. ఎక్కడ అమ్ముతున్నారు.. రైతులు ఎలా నష్టపోతున్నారు అనే వివరాలను ఇస్తామన్నా అధికారులు స్పందించలేని దుస్థితిలో ఉన్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ దుయ్యబట్టారు. ఆర్డీవోను కలిసి అన్ని వివరాలు అందించామని యూరియా డిమాండ్ ఎంత ఉంది? ఎంత సరఫరా చేస్తున్నారని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. బఫర్ స్టాకు లేదు.. వచ్చే పంటకు మళ్లీ తీసుకువస్తాం అంటూనే.. మళ్లీ కొరత లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అంతా మధ్యవర్తుల పాత్ర ఉందని అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రాయితీపై వచ్చే యూరియా మధ్యవర్తులకే వెళ్తోందన్నారు.
రైతులు సొమ్మసిల్లే పరిస్థితులు..
యూరియా, ఎరువుల కోసం రైతులు సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. రూ. 270కు విక్రయించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తూ రూ. 300కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం లూటీ చేసిందన్నారు.
కళ్లుండీ చూడలేని గుడ్డి ప్రభుత్వం
రాష్ట్రంలో కళ్లుండి చూడలేని.. చెవులుండి వినలేని అసమర్థ కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని పార్టీ తిరువూరు ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు మండిపడ్డారు. రైతులు యూరియా కొరతతో పాటు అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారన్నారు. అన్నపూర్ణగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారంటే కూటమి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఇంటూరి రాజగోపాల్ (చిన్నా), అవుతు శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నంబూరి రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, జెడ్పీటీసీ సభ్యులు గాదెల వెంకటేశ్వరరావు, వేల్పుల ప్రశాంతి, ముక్కపాటి నరసింహారావు, కంచికచర్ల ఎంపీపీ మలక్ బషీర్, మండల కన్వీనర్‌లు మహ్మద్ మస్తాన్, మంచాల చంద్రశేఖర్, వేమా సురేష్‌బాబు, బండి మల్లికార్జునరావు, కందుల నాగేశ్వరరావు, ఆవుల రమేష్‌బాబు, కోటేరు ముత్తారెడ్డి, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ పాల్గొన్నారు. కాగా కృష్ణాజిల్లా పరిధి ఉయ్యూరు ఆర్‌డీఓ కార్యాలయం వద్ద పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలు, గుడివాడ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గడిచిన ఏడాదిన్నరగా రాష్ట్రంలో గూండా రాజ్యం సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. యూరియా గురించి మాట్లాడితే బొక్కలో వేయండంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం బాధాకరమన్నారు. శాంతియుతంగా రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేస్తున్నా.. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి రైతులు, నాయకులు వస్తున్నా రాకుండా అడ్డుకున్నారని ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులను సైతం తనిఖీ చేసి నిర్ధాక్షిణ్యంగా దించి వెనక్కు పంపారని మండిపడ్డారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు ఉప్పెనలా తరలి వచ్చారని తెలిపారు.

కదనభేరి!