మరో 12 రోజుల్లో దుర్గగుడిలో దసరా ఉత్సవాలు ఆర్జిత సేవల టికెట్ల విక్రయాలపై స్పష్టత కరువు టికెట్లు అందుతాయో లేదోనని భక్తుల ఆందోళన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. మరో 12 రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతున్నా ఇంత వరకు సేవా టికెట్ల ఊసే లేకుండా పోయింది. దసరా ఉత్సవాల్లో ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన, ప్రత్యేక చండీహోమం, ప్రత్యేక ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. గతంలో సేవా టికెట్లను దేవస్థాన కౌంటర్ల విక్రయించడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచేవారు. అయితే ఈ ఏడాది ఆర్జిత సేవలపై మొదటి నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల కిందటే ఆర్జిత సేవల టికెట్లను పరిమిత సంఖ్యలోనే విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. అన్ని సేవలకు కలిపి రోజుకు 300 చొప్పున 11 రోజులకు 3,300 టికెట్లు విక్రయించేలా దేవస్థానం చర్యలు తీసుకుంది. దీంతో ఆర్జిత సేవా టికెట్లు తమ వరకు వస్తాయో రావోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక చండీహోమానికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ ఆర్జిత సేవలకు షిఫ్టునకు 75 టికెట్లు చొప్పున విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో ప్రముఖులు, వీఐపీలు, సిఫార్సు ఉన్న వారికే ఈ సేవ టికెట్లు దక్కుతాయనే భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేవస్థాన టోల్‌ఫ్రీ నంబర్‌కు రోజూ వస్తున్న ఫోన్ కాల్స్‌లో అత్యధికంగా సేవా టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపైనే కావడం గమనార్హం.
రెండు విడతలుగా ఆర్జిత సేవలు
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్ల రుసుమును దేవస్థాన అధికారులు ఖరారు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ.5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ.3 వేలు, మూలా నక్షత్రం రోజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్ర నవార్చనకు రూ.3 వేలు, ప్రత్యేక చండీహోమానికి రూ.4 వేలుగా టికెట్ల ధరలు ఖరారు చేశారు. ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన తెల్లవారుజాము ఐదు నుంచి ఆరు గంటల వరకు, ప్రత్యేక కుంకుమార్చన మహామండపం ఆరో అంతస్తులో మొదటి విడత ఉదయం ఏడు నుంచి 9 గంటల వరకు, రెండో విడత ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చన ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చండీహోమం యాగశాల నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజు ప్రత్యేక కుంకుమార్చన ఉదయం పది నుంచి 12 గంటల వరకు ఒక విడత మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ఉందన్నారు.
పరోక్ష సేవకు రూ.1,500
ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను పరోక్షంగా జరిపించుకునే అవకాశాన్ని దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఒక రోజు పరోక్ష సేవ టికెట్ ధరను రూ.1,500గా, 11 రోజుల పాటు సేవకు రూ.11,116గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరోక్ష సేవలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఉత్సవాల అనంతరం అమ్మవారి ప్రసాదాలను పోస్టల్ ద్వారా భక్తులు తెలిపిన చిరునామాకు పంపిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు.