
ఉద్యాన పంటల ఎగుమతితో అధిక లాభాలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జించొచ్చని ఏపీఈడీఏ రీజనల్ బిజిసెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ బి.అశోక్‌కుమార్ సూచించారు. బాపులపాడు మండలం మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్‌లోని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ), ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతి అవకాశాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికంగా పండే మామిడి, కూర గాయలు, ఆకుకూరలను ఎగుమతి చేసే అవకాశాలను ఏపీఈడీఏ కల్పిస్తోందని అశోక్‌కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా ఉద్యాన అధికారి జె. జ్యోతి మాట్లాడుతూ.. పంటల ఎగుమతి కోసం ఎఫ్‌ఈఓలు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలు, రాయితీలను వివరించారు. మామిడి పరిశోధన కేంద్రం (నూజివీడు) సినీయర్ శాస్త్రవేత్త బి.కనకమహాలక్ష్మి మాట్లా డుతూ.. మామిడిలో తరుచుగా కనిపించే చీడ పీడల నివారణ చర్యలు, నాణ్యమైన దిగుబడికి పాటించాల్సిన సన్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ‘సూక్ష్మ గామా’ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓ వివేక్ మాట్లాడుతూ.. ఐక్యూఎఫ్ పద్ధతి ద్వారా తాజా కూరగాయలను ఫ్రోజెన్ కూరగాయలుగా మార్చి ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బాపులపాడు, అవనిగడ్డ, ఉయ్యూరు, కంకిపాడు మండలాల ఉద్యాన శాఖ అధికారులు, ఉద్యాన రైతులు పాల్గొన్నారు.