
అందని జీతం.. వెతలే సమస్తం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకూ జీతాలు అందలేదు. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ‘జీతాలు ఇవ్వండి మహాప్రభో...’ అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలోనే ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ ముగిసింది. పలువురు టీచర్లకు వారు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి పొజిషన్ ఐడీలు రాలేదు. దీంతో ప్రభుత్వం వారి జీతభత్యాలను నిలిపివేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నప్పటికీ వీరి స్థానం మారడంతో ఏ పాఠశాలకు, ఎక్కడ స్థానానికి బదిలీ అయ్యారో దానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. అప్పుపడే సీఎప్‌ఎంఎస్‌లో వారి వివరాలు నమోదవుతాయి. అప్పుడు మాత్రమే వేతనాలు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. పోజిషన్ ఐడీ ఇవ్వటంలో ఆలస్యం కారణంగా బదిలీ అయిన ఉపాధ్యా యులు ఇప్పటి వరకూ జీతం అందుకోలేదు.
మూడు వేల మందికి అందని జీతాలు!
ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాపితంగా సుమారు నాలుగు వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వారిలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సమానస్థాయి కేడర్ ఉపాధ్యాయుల, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, ఆర్ట్/ డ్రాయింగ్ / క్రాఫ్ట్ / మ్యూజిక్ / ఉపాధ్యాయులు తదితర కేడర్లలో ఉన్న వారిలో సుమారుగా నాలుగు వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్స్‌కు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ఏర్పడటంతో ఇక్కడకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి నెల రోజులు కావొస్తున్నా నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా సుమారుగా మూడు వేల మంది ఉపాధ్యాయులకు జూలైలో తీసుకోవాల్సిన జూన్ నెల జీతాలు మంజూరు కాలేదు. వేతనాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొందరికే అందిన వేతనాలు
గత ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీఓ 21ను తీసుకొచ్చింది. ఆరు రకాల పాఠశాలల స్థానంలో ఇప్పుడు తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్ గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్‌లో కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ఈ పాఠశాలలకు కొత్తగా పోస్టులు మంజూరుకావడంతో ఆ స్థానాలకు బదిలీ పొందిన వారికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో అప్పటి వరకూ అదే స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్పటికే పొజిషన్ ఐడీలు ఉండడంతో వారికి వేతనాలు చెల్లించారు. ఇదే పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పాజిషన్ ఐడీలు రాకపోవడంతో వేతనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయిన పాఠశాలల్లోనూ ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈఎంఐలు చెల్లించక... చెక్‌లు బౌన్స్
ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా ప్రతి ఒక్కరూ నెల నెలా ఏదో ఒక చెల్లింపు చేస్తుంటారు. చాలా మందికి ఈఎంఐలు ఉంటాయి. అయితే జూన్ మాసం వేతనం జూలైలో పడకపోవటంతో దాదాపుగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ చెక్‌లు బౌన్స్ అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో సాధారణంగా ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం వంటి సామగ్రి కోసం రూ.వేలల్లో చెల్లించాల్సి ఉంటుంది. బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బదిలీ అయిన టీచర్లకు అందని జీతాలు వచ్చే నెలలో అయినావస్తుందో లేదోనని అనుమానం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 వేల మందికిపైగా ఎదురుచూపులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు ఆందోళన బాట పడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
సమస్యను తక్షణం పరిష్కరించాలి
ఉపాధ్యాయుల పొజిషన్ ఐడీల సమస్యను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి. బదిలీ అయిన చాలా వేలాది మందికి ఐడీలు రాక జూన్ మాసం జీతం అందలేదు. చాలా బంది బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకూ ఐడీలు రాకపోవటంతో బిల్లులు తయారు కాలేదు. దీని వల్ల వచ్చే నెలలోనూ జీతాల విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకొని స్పందించాలని విజ్ఞప్తి.
– ఎ.సుందరయ్య, ప్రధాన కార్యదర్శి,
యుటీఎఫ్, ఎన్టీఆర్జిల్లా
జూలై జీతం సైతం అనుమానమే
జూలై మాసానికి సంబంధించిన జీతాలు బిల్లులు అధికారులకు సమర్పించేందుకు గడువు సమీపించింది. ఇప్పటి వరకూ కొత్తగా ఐడీలు రావాల్సిన వారికి ఇంతవరకూ అందలేదు. ఐడీలు వచ్చిన తరువాత బిల్లులు తయారు చేయాల్సి ఉంటుంది. జూలై 25వ తేదీ లోపు బిల్లులు సమర్పిస్తేనే వాటికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి ట్రెజరీకి పంపటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ ఐడీలు రాకపోవటంతో వచ్చే నెలలోనూ జీతాలు అందు తాయో లేదోననే సందేహంలో ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం ఈ విధమైన ఇబ్బందులతో ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షిస్తుందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందని జీతం.. వెతలే సమస్తం