
వయసులో మైనర్లు.. చోరీల్లో మేజర్లు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆ ముగ్గురు ఒకే ప్రాంతానికి మైనర్‌లు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ రోజూ బడికి వెళ్లొచ్చే విద్యార్థులు. ఇది వారి తల్లిదండ్రులకు, ఆ ఊరి జనానికి తెలిసిన విషయం. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తుంటే తల్లిదండ్రులతో పాటు ఊరి జనం అభంశుభం తెలియని పిల్లలను ఏదో కేసులో ఇరిక్కించే ప్రయత్నం చేస్తున్నారని భయపడ్డారు. ఆ పిల్లలను పోలీసుల నుంచి రక్షించాలని ఊరి పెద్దలు సైతం ప్రయత్నించారు. ఆ ముగ్గురు బాలురు చేసిన నేరాలకు సంబంధించి రూ.లక్షల్లో సొత్తును పోలీసులు రికవరీ చేసి చూపించటంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ కేసు వివ రాలను బందరు డీఎస్పీ సీహెచ్.రాజ బుధవారం మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు..
బందరు మండలం మేకవానిపాలెం పంచాయతీ శివారు శ్రీనివాసనగర్‌కు చెందిన ఇద్దరు మైనర్‌లు ఎనిమిదో తరగతి, మరొకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన ఆ ముగ్గురు ఆన్‌లైన్ క్రికెట్ పందేలకు అల వాటుపడ్డారు. పందేలకు డబ్బు కావాలంటే దొంగ తనాలే మార్గమని నిర్ణయించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చిలకలపూడి, సర్కారుతోట, విశ్వబ్రాహ్మణకాలనీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రెక్కీ నిర్వహించటం మొదలుపెట్టారు. పగలు స్కూలు, కాలేజీకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో తాళాలు వేసివున్న ఇళ్లను గుర్తించేవారు. ఆర్టీసీ కాలనీకి చెందిన మహంకాళి గురు తేజశర్మ ఇంటిలోని మరో పోర్షనులో మోపిదేవి వెంకటసత్యశ్రీనివాసు నివసిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన వారిద్దరి ఇళ్లలో చొరబడిన ముగ్గురు బాలురు సుమారు 100 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ.1.12 లక్షల నగదు అపహరించారు. సర్కారుతోటలో మరో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి నగదు మాయం చేశారు. గురుతేజశర్మ, సత్యశ్రీనివాసులు మచిలీ పట్నం పోలీసులకు, సర్కారుతోటకు చెందిన బాధితులు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులను ఛేదించేందుకు డీఎస్పీ సీహెచ్ రాజ క్రైం టీం సిబ్బందిని రంగంలోకి దింపారు. క్రైం టీం సిబ్బంది మచిలీపట్నం ఎస్‌ఐ నేతృత్వంలో మైనర్‌లు గురుతేజశర్మ ఇంట్లో చోరీ చేసిన సెల్‌ఫోన్‌లో సిమ్ మార్చి వినియోగించడాన్ని గుర్తించారు. చోరీకి పాల్పడిన మైనర్లను అదుపులోకి తీసుకుని, మంచి మాటలతో కౌన్సెలింగ్ ఇవ్వగా వారు చేసిన నేరాలకు ఒప్పుకున్నారు. మైనర్‌లు చోరీ చేసిన సుమారు రూ.10 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులను వెంటనే రికవరీ చేసి అధికారుల ఎదుట ఉంచారు. ముగ్గురు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. కేసును ఛేదించిన క్రైం పార్టీ సిబ్బంది ఏఎస్‌ఐ జె.శ్రీనివాసు, హెచ్‌సీ కె.శ్రీనివాసరావు, పీసీలు జి.కోటేశ్వరరావు, జి.రామ కృష్ణతో పాటు మచిలీపట్నం ఎస్‌ఐ బి.ప్రభాకరరావు, పీసీ బి.శ్రీనివాసరావును డీఎస్పీ అభినం దించి, ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు పాల్గొన్నారు.
పగలు రెక్కీ, రాత్రి వేళ చోరీలు చేస్తున్న వైనం 100 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి చోరీ ముగ్గురు బాలురిని అదుపులోకి తీసుకున్న క్రైం పోలీసులు చోరీకి గురైన వస్తువులను రికవరీ చేసిన సిబ్బంది