
మహిళలకు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని అన్న మంత్రి అచ్చెనాయుడు వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు బుధవారం ఓప్రకటనలో ఖండించారు. అచ్చెన్నాయుడు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామన్న ప్రధాన ఎన్నికల హామీని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం ఆ పార్టీకి మహి ళలపై, ఎన్నికల వాగ్దానాలపై చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆడబిడ్డలకు ఆసరా, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, చేయూత పథకాలు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం మహిళలకు లబ్ధ్ది చేకూరేలా చేశారని కొనియాడారు. మహిళలపేరు మీదే ఇంటి పట్టాలు, సంక్షే పథకాలు అమలు చేశామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అబద్ధాలాడి, సూపర్ సిక్స్ పథకాలతో మోసం చేసి చంద్రబాబు గెలిచారన్నారు. గెలిచిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారా అని ఎవరైనా ప్రశ్నిస్తే అప్పు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే చెవిలో చెప్పమనడం వంటి మాటలు చంద్రబాబు వల్లెవేస్తున్నారని, ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలని అచ్చెనాయుడు చెబుతున్నారని ఈ రాష్ట్రానికి, మహిళలకి ఇదేనా వారు ఇచ్చే విలువ అని ప్రశ్నించారు. అమలు కాని హామీలు ఇచ్చి మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఆంధ్రను అమ్మాలంటే అంత హాస్యంగాను, అపహాస్యంగా కనబడుతోందా అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు