
సకల శుభాల శ్రావణం
పండుగలకు ‘నెల’వు.. మహిళలకు ప్రీతిపాత్రం
పెనుగంచిప్రోలు: తెలుగు క్యాలెండర్‌లోని పన్నెండు నెలల్లో శ్రావణం ఎంతో విశిష్టమైనది. సకల శుభాలకు ఆవాసంగా నిలిచే శ్రావణ మాసం ఈనెల 25న ఆరంభం కానుంది. ప్రతి ఇల్లు ఓ ఆలయంగా మారి.. ఉదయం, సాయంత్రం వేళల్లో భగవన్నామస్మరణతో మార్మోగనుంది. సామూహిక వరలక్ష్మీవ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకలు వరుసగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా లోని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం అధికారులు, కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళలకు ప్రత్యేకం..
ఈ మాసం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ధార్మిక, ఆధ్మాత్మిక, వ్యాపార ప్రారంభం వంటి శుభకార్యాలతో ముడిపడి ఉంటుంది. వివాహం, గృహ ప్రవేశం, గృహ నిర్మాణం, నామకరణం వంటి అనేక శుభ కార్యాలు నిర్వహించటానికి మంచి నెలగా అందరూ భావిస్తారు. కొత్త దంపతులు ఆషాఢంలో ఎడబాటుకు గురవుతారు. శ్రావణంలో కలుస్తారు. మహిళలు వ్రతాలు, లక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఒక విశిష్టత ఉంటుంది. నెల రోజులుగా ఆషాఢమాసంలో ముహూర్తాలు లేవు. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో మహిళలు శ్రావణ లక్ష్మీవ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 26 నుంచి సుముహూర్తాలు మొదలవనున్నాయి.
విష్ణు పూజలకు ప్రసిద్ధి..
సర్వమంగళ కారియైన గౌరి, లక్ష్మి, హరిహరులను విశేషంగా అర్చించే నెల కూడా ఇదే. చాంద్రమానం ప్రకారం శ్రావణాన్ని ఐదో నెలగా పరిగణిస్తారు. ఈనెల పౌర్ణమిన చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో సంచరిస్తున్నందున శ్రావణ మాసం అనే పేరు వచ్చినట్లు పండితులు చెబుతారు. శ్రవణ నక్షత్రం మహావిష్ణువు జన్మ నక్షత్రం కావటంతో విష్ణు పూజలకు ప్రసిద్ధి. ఈ నెలలో వచ్చే మంగళ, శుక్ర, శనివారాలను అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. మంగళవారం గౌరీ పూజలు, శుక్రవారాల్లో లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణు పూజలు చేస్తారు.
వ్యాపారులకు ఊరట..
48 రోజులుగా వివాహ ముహూర్తాలు లేకపోవటంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న కల్యాణ మండపాలు, వస్త్ర, నగల దుకాణాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు ఖాళీగా ఉన్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్, డెకరేషన్ వారు, భోజనాల తయారీ వారు డీలా పడ్డారు. శ్రావణ మాసం రానుండటంతో వారికి ఊరట లభించనుంది.
25 నుంచి శ్రావణమాసం ప్రారంభం వ్రతాలు, నోములకు మహిళల సమాయత్తం ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు శుభకార్యాలకూ ఇదే సమయం
ముఖ్యమైన పండుగలు..
శ్రావణ మాసంలో ఎన్నో విశేష పండుగలు వస్తాయి. ఈనెల 26న తొలి శుక్రవారం, ఆగస్టు ఒకటో తేదీ రెండో శుక్రవారం, 3న ఆదివారం స్నేహితుల దినోత్సవం, 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పండుగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, 15న నాల్గో శుక్రవారం, స్వాతంత్య్ర దినోత్సవం, 16న శ్రీకృష్ణాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. 22న ఐదో శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపద మాసం వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 27న జరగనున్న వినాయక చవితితో అది ప్రారంభమవుతుంది.

సకల శుభాల శ్రావణం