
తాగునీటి నాణ్యతపై అప్రమత్తత అవసరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వర్షాకాలం నేపథ్యంలో నగర ప్రజలకు సరఫరా చేసే తాగునీటి శుద్ధి, నాణ్యతా ప్రమాణాలు, సరఫరా వ్యవస్థలో ఎక్కడా లోపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం ఆయన విద్యాధరపురం 38వ డివిజన్ పరిధిలోని డాక్టర్ కేఎల్ రావు మునిసిపల్ హెడ్ వాటర్ వర్క్స్‌ను సందర్శించి నీటి శుద్ధి, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. నిర్వహణ, ఆధునిక మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైపుల లీకేజీలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిరంతర తనిఖీలతో నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ చీఫ్ ఇంజినీర్ ఆర్. శ్రీనాథ్‌రెడ్డి, పర్యవేక్షణ ఇంజినీర్ పి. సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
అడ్డొచ్చిన పాము.. కాలువలోకి దూసుకెళ్లిన కారు
పెనమలూరు: పెదపులిపాక వద్ద కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎటుంవటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం గ్రామానికి చెందిన లంక రవిరాజు పూజారిగా పని చేస్తారు. ఆయన కారులో సోమవారం రాత్రి పెదపులిపాక నుంచి చోడవరం గ్రామానికి బయలుదేరారు. అలా వెళ్తున్న సమయంలో పెదపులిపాక వద్ద రోడ్డుపైకి అకస్మాత్తుగా పాము రావటంతో దానిని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు కేఈబీ కెనాల్‌లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ కాలువలో నీరు తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించారు.
విధులను అంకితభావంతో నిర్వర్తించండి
కోనేరుసెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సెక్షన్‌లోనూ సిబ్బంది రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి అందాల్సిన బెనిఫిట్స్‌తో పాటు మరణించిన సిబ్బంది కుటుంబాలకు శాఖాపరంగా అందే ప్రయోజనాలు అందే విషయంలో అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏవో ఎంఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

తాగునీటి నాణ్యతపై అప్రమత్తత అవసరం