
యానిమేషన్ పేరుతో చీటింగ్..
విజయవాడ కేంద్రంగా కిరణ్ అనే వ్యక్తి యానిమేషన్ పేరిట సాఫ్ట్‌వేర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నామని.. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రాజెక్టుల కోసం కొంత పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని నమ్మబలికాడు. దీంతో తొలుత చెప్పిన విధంగా కొన్ని రోజుల పాటు వ్యాపారులకు పెద్ద ఎత్తున లాభాలు అందించి, పెట్టుబడి పెట్టిన వ్యాపారులకు నమ్మకం కలిగించారు. దీంతో విజయవాడ, భీమవరం, నరసరావుపేట, గుంటూరు, కడపలకు చెందిన 100 మందికిపైగా బాధితులు రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయితే సదరు సంస్థ చెప్పిన విధంగా లాభాలు ఇవ్వకపోగా, పెట్టుబడులు కూడా వెనక్కి రాలేదు. గత కొన్ని నెలల నుంచి కంపెనీ చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో, మోసపోయామని గ్రహించి విజయవాడలోని కార్యాలయంలోకి వెళ్లి ఒత్తిడి తేవడంతో నిర్వాహకుడైన కిరణ్ బోర్డు తిప్పేసి, కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లడంతో, బాధితులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది. బాధితుల నుంచి సేకరించిన పెట్టుబడులు ఏమైయ్యాయో తెలియటం లేదు. కేసు పోలీసు విచారణలో ఉందంటున్నారు కాని, బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు.