
ముగిసిన పాలిసెట్–2025 సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ద్వారా నిర్వహించిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నెల 21వ తేదీన మొదలైన సర్టిఫికెట్ల పరిశీలన శనివారం సాయంత్రం ముగిసింది. సర్టిపికెట్ల పరిశీలన కోసం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్రా లయోలా డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు తేదీలను కేటాయించి వాటి ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన చేసి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చునని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.
492 మంది సర్టిఫికెట్ల పరిశీలన
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 84 మంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 217 మంది, ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 191 మంది సర్టిఫికెట్లను శనివారం పరిశీలించారు. మొత్తం 492 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని విజయసారథి చెప్పారు.
కృష్ణాజిల్లాలో...
గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తొలిసారిగా నిర్వహించిన పాలీసెట్–2025 కౌన్సెలింగ్ శనివారంతో ముగిసినట్లు కోఆర్డినేటర్ వీవీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్‌లో మొత్తం 1,075 మంది అభ్యర్థులు పాల్గొని తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నట్లు వివరించారు. కౌన్సెలింగ్ నిమిత్తం కళాశాలలో ఏర్పాటుచేసిన సదుపాయాలపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందం, సిబ్బందిని ఆయన అభినందించారు.
రేపటి నుంచి వెబ్
ఆప్షన్స్‌కు అవకాశం