రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
మైలవరం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలవరంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి సమీపంలో గురువారం రాత్రి జరిగింది. మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామానికి చెందిన గురజాల సాయి(27) జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మైలవరంలో పని ముగించుకుని తన ద్విచక్రవాహనంపై రాత్రి ఇంటికి వెళుతున్నాడు. మైలవరం జాతీయ రహదారిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వాహనంలో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతునికి ఆరేళ్ల క్రితం వర్షిణితో వివాహమైంది. మృతుని తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


