
కాలుష్యం కోరల్లో కృష్ణమ్మ
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రకృతి ప్రసాదించిన జీవనది కృష్ణమ్మకు కష్టాలు వచ్చి పడ్డాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఓ వైపు మురుగునీరు, పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నదీ జలాలు కలుషితమవుతుంటే మరోవైపు భవన శిథిలాలు, మట్టితో కృష్ణానది పరివాహక ప్రాంతం పూడ్చివేతకు గురవుతోంది. రాణిగారితోట, 18వ డివిజన్‌లో వారధి వెంబడి ఉన్న ర్యాంప్ ద్వారా కొందరు ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను ట్రాక్టర్లు, ఆటోల, ఇతర వాహనాల ద్వారా నదీగర్భంలోకి తరలించి డంప్ చేస్తుండగా సాక్షాత్తు ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసే ఓ కాంట్రాక్టర్ కూడా టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని నదిలోకి తొలి పూడ్చివేతకు పాల్పడుతున్నారు. కృష్ణానదిలో ఇసుక తిన్నెలతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి ఆక్రమణ లు గానీ, వ్యర్థాలు గానీ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ సంబంఽధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తుండడంపై పలు విమర్శలొస్తున్నాయి. కాలువలు, చెరువుల్లో పూడిక తీయాలని ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం కృష్ణానదిని వ్యర్థాలతో నింపి పూడ్చే దిశగా ప్రయత్నం చేస్తుండడం శోచనీయం. కృష్ణానదిపై పర్యవేక్షణ లోపించటం వలనే పూడ్చివేతకు గురవుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నదీ పరివాహక ప్రాంతంలో, నదీగర్భంలో ఎలాంటి చెత్తాచెదారం, భవన శిథిలాలను వేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని అతిక్రమించి రేయింబగళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్లు, ఆటోల ద్వారా నదిలో డంప్ చేస్తూ కృష్ణానదిని డంపింగ్ యార్డుగా మార్చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల రాణిగారితోట, 18వ డివిజన్, సిమెంట్ గోడౌన్స్‌లో ఓ కాంట్రాక్టర్ నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. తానేం తక్కువ కాదన్నట్లు నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వగా వచ్చిన మట్టిని టిప్పర్ల ద్వారా నదీగర్భంలోకి తరలించి వారధి పక్కన, రిటైనింగ్ వాల్ వెంబడి డంప్ చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దాదాపు 50 టిప్పర్ల వరకు మట్టిని నదిలోకి తరలించారని, అందుకు అధికారుల సహకారం ఉన్నట్లు సమాచారం. కృష్ణానది పూడ్చి వేతకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వలన నదిలో వ్యర్థాలు పేరుకుపోయి రాబోయే రోజుల్లో నదీజలాలు అడుగంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి నదీ గర్భ పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నదీగర్భంలో వ్యర్థాలు వేయరాదని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్ ఎవరి అండ చూసుకుని టన్నుల కొద్దీ మట్టిని నదిలోకి తరలించాడో చెప్పాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్‌తోనే నదిలో నుంచి మట్టిని తొలగించేందుకు చర్యలు చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని, నదులను సంరక్షించే బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నారు.
రక్షణగా గేటు ఏర్పాటు చేస్తాం
డంపింగ్ యార్డులా తయారైన కృష్ణానది
వ్యర్థాలు, మట్టికుప్పలతో
నింపేస్తున్న వైనం
కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం
చోద్యం చూస్తున్న వీఎంసీ అధికారులు
కృష్ణానదిలో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. వాటర్ ట్యాంక్ నిర్మాణంలో భాగంగా వచ్చిన మట్టిని కాంట్రాక్టర్ కృష్ణానదిలో వేసినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించి నోటీసులిస్తాం. అక్కడ నుంచి మట్టి కుప్పలను కాంట్రాక్టర్ తోనే తొలగింపచేసేందుకు చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా నదిలోకి ఎవరూ వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడతాం. రెండు మూడు నెలల్లో రక్షణగా గేటును ఏర్పాటు చేస్తాం.
–సామ్రాజ్యం, వీఎంసీ ఈఈ (సర్కిల్–3)

కాలుష్యం కోరల్లో కృష్ణమ్మ