
మసుల ఫెస్ట్ వేడుకలను విజయవంతం చేస్తాం
● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు ● అధికారులతో కలిసి మసుల ఫెస్ట్ ఏర్పాట్ల పరిశీలన ● ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు, సలహాలు జారీ
కోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్‌ను విజయ వంతం చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న జల క్రీడలు, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అందరి సమన్వయంతో సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. బుధవారం ఆయన మంగినపూడి బీచ్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లకు సంబం ధించి అధికారులతో చర్చించారు. అనంతరం జల క్రీడలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. క్రీడలను వేల సంఖ్యలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టం, ప్రమాదాలు జరగకుండా రక్షణ వలయాలు పకడ్బందీగా చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కెనోయింగ్, కయా కింగ్ వంటి జల క్రీడలు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలకు మసుల ఫెస్ట్–25గా నామకరణం చేశామని, త్వరలో డాల్ఫిన్ లోగోను ఆవిష్కరిస్తామన్నారు. మత్స్యకారులకు గుర్తుగా ఈ చిహ్నాన్ని మలిచారన్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సాంస్కృతిక, పర్యాటక రంగాలలో ఉన్న ప్రముఖులను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్‌డీఓ ఝాన్సీలక్ష్మి, విజయవాడ క్రీడల అధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ హరినాథ్, జల క్రీడల జిల్లా అధ్యక్షుడు దావులూరి సురేంద్రబాబు, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.