
దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయ వాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
పెనమలూరు సర్పంచి
3 నెలలు సస్పెన్షన్
పెనమలూరు: పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావును మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పెనమలూరు గ్రామం పల్లిపేటలో నిబంధనలకు విరుద్ధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు, రూ.55,25,112, గ్రామ పంచాయతీ సాధారణ నిధులతో పల్లిపేటలో సీసీ రోడ్డు వేశారని డీఎల్‌పీవో విచారణలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.63,42,912 సర్పంచి భాస్కరరావు, పూర్వ పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు అభ్యంతరకరంగా ఖర్చు చేశారని డీపీఓ నివేదిక ఇచ్చారు. దీంతో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచి భాస్కరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉపసర్పంచి శీలం సుమతికి సర్పంచి బాధ్యతలు అప్పగించారు. చెక్ పవర్ ఉప సర్పంచితో పాటు డెప్యూటీ మండల పరిషత్ అధికారికి కౌంటర్ సంతకం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.