
ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి
కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేలా ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గవర్నెన్స్ అధికారి మంగళవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, పలువురు అధికారులు వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ అనంతరం గీతాంజలిశర్మ అధికారులతో మాట్లాడుతూ.. అర్జీదారులతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా కాల్‌సెంటర్ 1100 నంబరు నుంచి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని, దాని విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వశాఖల అధికారులకు ర్యాంకింగ్ ఇస్తున్నా రని పేర్కొన్నారు. ఇకపై ప్రజాసమస్యలపై వెంటనే స్పందించి వారితో సానుకూలంగా మాట్లాడి అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాల నలో ప్రజల సంతృప్తి స్థాయి చాలా కీలకమన్నారు. మండలాల్లో పరిపాలనా విధానం బాగాలేదని ప్రజలు చెబుతున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జూన్ 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఏ మేరకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఎస్‌ఓ వి.పార్వతి, ఇన్‌చార్జ్ సీఈఓ ఆర్.సి.ఆనంద్‌కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.