
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
విజయవాడస్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని, క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు క్రీడాకారులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సిలంబం(కర్రసాము) పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. ఎస్‌వీఆర్‌కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 73 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచ క్రీడా వేదికపై అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర, దేశ గౌరవాన్ని పెంచాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో సిలంబం కోచ్‌లు శ్రీకాంత్, వర్మ తదితరులు పాల్గొన్నారు.