బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

బరితెగింపు

May 20 2025 12:48 AM | Updated on May 20 2025 12:48 AM

బరితె

బరితెగింపు

బలం లేకపోయినా

సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు మునిసిపల్‌ చైర్మన్‌ పదవి కోసం తెలుగుదేశం పార్టీ దుశ్శాసన, దుర్వినీత పర్వానికి తెరతీసింది. సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తన అనుచరులతో కలిసి మునిసిపల్‌ కార్యాలయం వద్ద వీధి రౌడీలా వ్యవహరించారు. తాయిలాలు ఎరవేసి వైఎస్సార్‌ సీపీ సభ్యులను తన వైపు తిప్పుకునేందుకు యత్నించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లను మునిసిపల్‌ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. రెండు గంటలపాటు భీతావహ వాతావరణం సృష్టించారు. ఈ దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అడుగడుగునా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. దీంతో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యకుడు దేవినేని అవినాష్‌, నియోజకవర్గపార్టీ ఇన్‌చార్జి స్వామిదాసు ఆధ్వర్యంలో పార్టీ నాయకులే కవచంలా ఏర్పడి రక్షించుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పార్టీ జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

భర్తతో ఒత్తిడి చేయించి..

ఒకటో వార్డు కౌన్సిలర్‌ కొలికపోగు నిర్మల భర్తను టీడీపీలో చేర్చుకున్న కూటమి నేతలు అతని చేత ఆమైపె ఒత్తిడి చేయించారు. అయినా ఆమె వైఎస్సార్‌ సీపీకే ఓటు వేస్తానంటూ తేల్చి చెప్పారు. పార్టీ కౌన్సిలర్లతోపాటు చైర్మన్‌ ఎన్నిక కోసం సోమవారం మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చారు. అయితే నిర్మలను కిడ్నాప్‌ చేశారంటూ ఆమె భర్తతో పోలీసు కేసు పెట్టించిన ఎమ్మెల్యే కొలికపూడి మునిసిపల్‌ కార్యాలయం వద్ద గొడవకు దిగారు. వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు, నేతలను అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లు, రాళ్లతో చెలరేగిపోయారు. అయినా వైఎస్సార్‌ సీపీ నాయకులు సంయమనం పాటించారు.

అండగా అవినాష్‌..

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పోలీసుల నిర్బంధాలను దాటుకుని మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చి తమ కౌన్సిలర్లకు రక్షణగా నిలిచారు. ఈ దశలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అవినాష్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అయినా వెనక్కి తగ్గని అవినాష్‌తోపాటు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామి దాస్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సుధారాణి, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్‌, షేక్‌ ఆసిఫ్‌ కౌన్సిలర్లకు అండగా నిలిచారు. చివరకు పోలీసులే నిర్మలను బలవంతంగా తీసుకెళ్లి ఆమె భర్తకు అప్పగించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

కమిషనర్‌కు ఫిర్యాదు..

టీడీపీ నాయకుల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్‌, పీఏసీ సభ్యుడు షేక్‌ ఆసిఫ్‌ వైఎస్సార్‌ సీపీ వార్డు సభ్యులతో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

తిరువూరులో టీడీపీ అరాచక పర్వం

గెలవలేమని తెలిసీ..

ప్రజాస్వామ్యం ఖూనీ..

మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. టీడీపీ బరిలో నిలిపిన చైర్మన్‌ అభ్యర్థి కూడా టీడీపీలో గెలిచిన వ్యక్తి కాదని, పోలీసులు ఖాకీ యూనిఫామ్‌ బదులు, పచ్చ దుస్తులు వేసుకున్నారన్నారు. తమ కౌన్సిలర్‌ను లాక్కెళ్లి ఆమె మెడలోని వైఎస్సార్‌ సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారని, ఎన్టీఆర్‌ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్‌ కమిషనర్‌ను ప్రశ్నించారు.

కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి..

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారన్నారు. ఎన్నిక జరగకుండా ఉండేందుకు చెప్పులు.. వాటర్‌ బాటిల్స్‌ విసిరి రాద్ధాంతం చేశారన్నారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేని అధికారులపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి.. నేటి ఎన్నికను ప్రశాంతంగా జరిపించాలని కోరుతున్నామన్నారు.

తీవ్ర అభ్యంతరకరం..

ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్‌ మాట్లాడుతూ తిరువూరులో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తమకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌కు వచ్చి ప్రజాప్రతినిధులు ఏనాడైనా కోరుకున్న సందర్భాలున్నాయా అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితులను ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. తిరువూరులో పోలీసులు పసుపు చొక్కాలేసుకుని డ్యూటీలు చేశారని విమర్శించారు..

తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఇరవై వార్డులకు 17 వైఎస్సార్‌ సీపీ గెలుపొందింది. టీడీపీ మూడు వార్డులనే గెలుచుకోగలిగింది. అప్పట్లో చైర్మన్‌గా ఎన్నికై న గత్తం కస్తూరిబాయి ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషన్‌ సోమవారం ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని అదునుగా భావించిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చైర్మన్‌ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు కాకర్లమూడి సుందర్‌కుమార్‌, పసుపులేటి శేఖర్‌బాబు, దారా పద్మజను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకున్నారు. మరో ఇద్దరిని బలవంతంగా తమ వైపు తిప్పుకున్నారు. అయినా బలం చాలకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించేందుకు దౌర్జన్యాలకు తెగబడ్డారు.

బరితెగింపు1
1/1

బరితెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement