
పని చేయకపోతే సస్పెండ్ చేస్తా
జగ్గయ్యపేట: ‘ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు ఓపికగా వినాలి.. మీరేమైనా బ్రిటీష్ రాజ్యంలో ఉన్నారా? సమస్యలపై స్పందన లేకుంటే ఎలా?’ అని కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని కోదాడ రోడ్డులో గల బీ– కన్వెన్షన్ హాల్‌లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో అన్ని శాఖల నుంచి అత్యధికంగా ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తున్నారన్నారు. రెవెన్యూ, మునిసిపల్, మహిళ శిశు సంక్షేమశాఖల నుంచే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
పద్దతి మార్చుకోకుంటే..
నందిగామ డివిజన్ పరిధిలోని సర్వేయర్లు, తహసీల్దార్ల పనితీరు సక్రమంగా లేదని పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. గత వారం తిరువూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కూడా అధికారులను మందలించినా మార్పు రాలేదన్నారు. ప్రతి అర్జీదారుడు ఇచ్చే అర్జీని మండలంలోని అన్ని శాఖల ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలే తప్ప సమస్యపై నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు.
పీ4 సర్వే తీరుపై మండిపాటు..
జిల్లాలో అన్ని గ్రామాల్లో జరుగుతున్న పీ4 సర్వే కొన్ని గ్రామాల్లో సక్రమంగా జరగడంలేదని కలెక్టర్ అన్నారు. కొందరు ఎంపీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారిని ఉపేక్షించేదిలేదన్నారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు కూడా మీ పరిధిలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలను కూడా గుర్తించి పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ ఎన్.వి.నాంచరరావు, డీపీవో లావణ్య కుమారి, ఏసీపీలు తిలక్, వెంకటేశ్వరరావు, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు, అని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
461 అర్జీలు స్వీకరణ....
జగ్గయ్యపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై 461 అర్జీలు వచ్చాయి. వీటిలో జగ్గయ్యపేట మండలం నుంచి 222, పెనుగంచిప్రోలు 56, వత్సవాయి 44, నందిగామ మండలం నుంచి 38, చందర్లపాడు 8, వీరులపాడు 4, కంచికచర్ల 8 చొప్పున అర్జీలు వచ్చాయి.
అర్జీల పరిష్కారంపైప్రత్యేక దృష్టి పెట్టండి
డీఆర్వో లక్ష్మీ నరసింహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీదారుడు సంతృప్తి చెందేలా స్పష్టమైన సమాచారంతో అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 63 అర్జీలు అందాయి.
● పెనుగంచిప్రోలులోని పాత సినిమాహల్ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం (బురుజు సెంటర్) వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణకు సర్వే చేస్తున్నారని స్థానికులు వివరించారు. అయితే అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. రోడ్డు విస్తరణ చేస్తే తమ గృహాలు నేలమట్టం అవుతాయని న్యాయం చేయాలంటూ మహిళలు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
● పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఇటీవల కల్లు గీత కార్మికుని కోటాలో మద్యం దుకాణం మంజూరైందని, అయితే దుకాణాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు నడుపుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన దినేష్, దొండ రాంబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా దుకాణం చుట్టూ గృహాలు ఉన్నాయని, అనధికారికంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయడంతో మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు.
● షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు సమీపంలోని ఆటోనగర్ వద్ద గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూ.కోటి వ్యయంతో హైవే బస్‌స్టాండ్ నిర్మాణం జరిగిందని, అయితే 11 నెలలుగా బస్‌స్టాండ్ నిరుపయోగంగా ఉందని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ అర్జీ అందించారు.
నందిగామ రెవెన్యూ అధికారులపై కలెక్టర్ లక్ష్మీశ ఆగ్రహం పీజీఆర్‌ఎస్‌లో 461 అర్జీలు స్వీకరణ
వచ్చిన అర్జీల్లో కొన్ని..

పని చేయకపోతే సస్పెండ్ చేస్తా