
హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం
హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. స్వామివారి ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1008 గులాబీ పూలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక వేదికపై దాసాంజనేయ భజన సమాజం భక్త బృందం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసింది. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలోని రామాలయం వద్ద భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఉత్సవాలు జరిగే ఆరు రోజులు నిత్యం భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తామని ఆర్యవైశ్య సంఘం నాయకుడు పైడి సుధాకర్ తెలిపారు.