
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
పర్యావరణ పరిరక్షణ
ప్రతి ఒక్కరి బాధ్యత
జి.కొండూరు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించినప్పుడే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడంతో పాటు భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండలంలోని చెవుటూరు గ్రామంలో శని వారం నిర్వహించిన స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్‌లో స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల బీట్ ది హీట్‌ను థీమ్‌గా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఒక చెట్టును నరకడం తప్పనిసరైతే పది మొక్కలను నాటాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు పెంచడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని సైతం వదిలేయాలని సూచించారు. చలివేంద్రాల ఏర్పాటు, అన్ని కార్యాలయాల్లో మంచి నీటి సౌకర్యం, ఇంకుడు గుంతలు, నీటి రీచార్జ్ నిర్మాణాలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. వడదెబ్బ నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెవుటూరు సర్పంచ్ పిన్నిబోయిన శ్రీదేవి, వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు, డీపీఓ పి.లావణ్యకుమారి, డీఆర్‌డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డ్వామా పీడీ ఎ.రాము, తహసీల్దార్ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ బి.వి.రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.