
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వినూత్న నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): సమస్యల పరిష్కారం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శనివారం వినూత్న నిరసన తెలిపారు. ఉద్యమాన్ని ప్రారంభించి శనివారంతో 20 రోజులు పూర్తయిన నేపథ్యంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హృదయాకృతిలో ఏర్పడి నిరసన తెలిపారు. సంఘ ప్రతినిధి వి.నాగబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ నిరసన ప్రదర్శనలకు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రధానంగా ఆరు సంవత్సరాలు దాటిన వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ ఇంక్రిమెంట్లతో పాటు పీఎఫ్ చెల్లింపులు చేపట్టాలన్నారు. ఇన్సెంటివ్‌లు చెల్లించాలని కోరారు. దీంతో పాటుగా తాము నిర్వహిస్తున్న కేంద్రాల కరెంటు బిల్లులు, అద్దె బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలు మూలల నుంచి వచ్చిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు.