
టెన్త్ సప్లిమెంటరీకి సన్నద్ధం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షను రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికెట్‌పై సప్లిమెంటరీగా నమోదైది. కానీ గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 59 పరీక్షా కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ప్రత్యేక తరగతులు....
గతేడాది మాదిరిగానే పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు ఉత్తీర్ణులయ్యే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు దాదాపుగా అన్ని పాఠశాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఆయా సబ్జెక్ట్‌లకు చెందిన ఉపాధ్యాయులు ప్రతి రోజూ ప్రత్యేక తరగతులను తీసుకొని తప్పిన విద్యార్థులను పరీక్షలకు సమాయత్తపరుస్తున్నారు. కొన్ని మెలకువలను నేర్పించి తీర్చిదిద్దుతున్నారు. హాల్ టికెట్లను పరీక్షల విభాగం ఆయా పాఠశాలలకు పంపించగా, ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించే పనిలో ఉన్నారు.
24 వరకూ ఓపెన్ స్కూల్ పరీక్షలు...
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ విద్యార్ధులకు సైతం ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పదో తరగతితో పాటుగా ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరవుతారు. వీరికి సంబంధించి 1677 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలకు పదో తరగతికి 17, ఇంటర్మీడియెట్‌కు 12 చొప్పున పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు.
అధికారుల నియామకం
జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 30 కేంద్రాలకు 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నియమించారు. వారితో పాటుగా మరో 30 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లును నియమించారు. ప్రశాపత్నాలు భద్రపరిచేందుకు, వాటిని పంపిణీ చేసేందుకు వివిధ పోలీసుస్టేషన్లను ఎంపిక చేశారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సైతం మరో 29 మంది అధికారులను కేటాయించారు. వాటితో పాటుగా పరీక్షల నిర్వహణకు సుమారుగా 300 మంది ఇన్విజిలేటర్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏడు బృందాలు పరీక్షలను పరిశీలించనున్నాయి. ప్రశ్నాపత్రాల పంపిణీని ఈ నెల 16వ తేదీన ప్రారంభించారు.
19 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న 1677 మందిఓపెన్ స్కూల్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ పరీక్షలకు మరో 29 కేంద్రాలు
పరీక్షకు హాజరు కానున్న 6149 మంది విద్యార్థులు
పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 30 కేంద్రాలను, ఓపెన్ స్కూల్ పరీక్షలకు 29 కేంద్రాలను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆయా పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సైతం దృష్టా సారించి వాటిని సిద్ధం చేస్తున్నాం. ఇతర విభాగాల సహకారంతో అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేస్తాం. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్
మార్చి 19వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలను నిర్వహించింది. అందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి 27,467 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 23,534 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే వారిలో 3933 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్ట్‌ల్లో తప్పటంతో పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణులు కానట్లుగా ఫలితాలను ప్రకటించారు. వారితో పాటుగా గతంలో ఫెయిలైన విద్యార్థులతో కలిపి మొత్తం 6149 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ఉండటంతో దాదాపుగా అన్ని మండలాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

టెన్త్ సప్లిమెంటరీకి సన్నద్ధం