
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లో శనివారం మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నగరంలో వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయని, నీటి సరఫరా జరుగుతుందంటే కారణం మున్సిపల్ కార్మికులేనన్నారు. అటువంటి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేయకపోవడం అన్యాయమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచారని చెప్పారు. ఆప్కాస్ ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు అందించిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల పై బడిన కార్మికులను క్రమబద్దీకరించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి ఆదుకోవాలని విన్నవించారు. ఇతర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు భవిష్యత్‌లో చేపట్టే ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు. ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేష్, పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించండి
జికొండూరు: సేంద్రీయ ఎరువుల తయారీ గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సేంద్రీయ ఎరువుల గుంతలతో పారిశుద్ధ్యం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు బహుళ ప్రయోజనాలు కలిగిన సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చని సూచించారు. జికొండూరులో సేంద్రీయ ఎరువుల (కంపోస్ట్ ఫిట్) తయారీ గుంతల తవ్వకం పనులను శనివారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కంపోస్ట్ ఫిట్‌లకు ఎటువంటి ఖర్చులు లేకుండా ఉపాధిహామీ పథకంలో చేపట్టవచ్చన్నారు. ఈ ఏడాది జిల్లాలో 17వేల గుంతలు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం, పశు వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రాము, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డీపీవో లావణ్యకుమారి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్