
ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి
పెనుగంచిప్రోలు: విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే అడ్మిషన్ల పేరిట తమ వద్ద పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రైవేటు విద్యాసంస్థలు వేధిస్తున్నాయి. మండుటెండల్లో ఇంటింటి ప్రచారం చేసి విద్యార్థులను చేర్పించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్లను తీసుకురాకుంటే జీతం ఇవ్వబోమని హెచ్చరిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల తీరుతో ప్రైవేటు టీచర్లు, అధ్యాప కులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక పీజీ, డిగ్రీ, బీఈడీలు చేసిన ఎంతోమంది జీవనం సాగించటానికి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి రెండు నెలల ముందే విద్యార్థుల ప్రవేశాలకు టార్గెట్ విధిస్తూ సిబ్బందిని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచి ప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో సుమారుగా 50 వరకు ప్రైవేటు పాఠశాలలు, పది కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా పెనుగంచిప్రోలులో రెండు, జగ్గయ్యపేటలో మరో రెండు కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. ఈ సంస్థల్లో వెయ్యి మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు గత నెల నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇంటింటికి పంపిస్తు న్నాయి. వారు ప్రతి ఇంటికీ వెళ్లి ‘మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా, ఉంటే ఏం చదువుతున్నారు’ అన్న సమాచారం సేకరిస్తున్నారు. వారిని తమ పాఠశాల, కళాశాలలో చేర్పించండని తల్లిదండ్రులను బతిమలాడుతున్నారు.
టార్గెట్ పూర్తయితేనే..
ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్లు పూర్తి చేస్తేనే సెలవుల్లో జీతాలు ఇస్తామని కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఒకొక్కరు కనీసం పది నుంచి 15 మందిని చేర్పించాలన్నది లక్ష్యం. అలా చేర్పించిన తరువాత కూడా సెలవుల అనంతరం పాఠశాల తెరిచాక ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది నానాతంటాలు పడుతుంటారు. భగభగ మండే ఎండల్లో ఇంటింటికీ తిరుగుతూ నానా కష్టాలుపడుతున్నారు. పిల్లలను చేర్పించటం ఒక పని అయితే స్థానికంగా పాఠశాలల నిర్వహణ చూసే బాస్‌లు సిబ్బందితో మాట్లాడే భాష, వారి ప్రవర్తన మరింత ఇబ్బంది పెట్టేలా ఉంటుందని పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. అడ్మిషన్ల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడి మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సతమతమవుతున్న సిబ్బంది
ఒకవైపు బోధన, మరోవైపు అడ్మిషన్ల టార్గెట్‌ను పూర్తిచేసే పనిలో ప్రైవేటు, కార్పొరేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర వత్తిడికిలోనై మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. తమ వేదనను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న సమయంలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాట మాడుతున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధించే టీచర్లకు నెలకు రూ.4,500 నుంచి రూ.5 వేల జీతం మాత్రమే ఇవ్వడం గమనార్హం.
పిల్లలను స్కూళ్లలో చేర్పించాలంటూ టార్గెట్లు ఎండల్లో ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశం అడ్మిషన్లను తీసుకురాకుంటే జీతం అందనట్టే మనోవేదనకు గురవుతున్న ప్రైవేటు టీచర్లు
భారీగా ఫీజులు
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధన జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలో అమలు కావటం లేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు దండుకుంటున్నారు. టెక్నో, ఈ–టెక్నో, సీబీఎస్‌ఈ , ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్ తదితరాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపుతున్నారు. దీనికి అద నంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు, టై వంటివి ఆయా పాఠశాలల్లోనే అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు.