
నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హిందూ పూర్‌కు చెందిన బి.నవీన్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈఓ శీనానాయక్‌ను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందచేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన శీలం సాయి ఫణీంద్ర కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం సమర్పించింది. దాతలకు ఈఓ శీనానాయక్, ఆలయ పర్యవేక్షకుడు నాథురామ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
దుర్గమ్మకు వెండి
పంచపాత్ర సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్రను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్ష్మీకాంతం దంపతులు ఆలయానికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం రూ.2 లక్షలు ఖర్చుచేసి 2.028 కిలోల వెండితో తయారు చేయించిన పంచపాత్రను ఆలయ అధికారులకు అందజేశారు. లక్ష్మీకాంతం దంపతులకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.
తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): స్థానిక వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో కానుకల లెక్కింపు నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పవన్‌కల్యాణ్, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
అడ్డుకున్న గ్రామస్తులు
హుండీ కానుకల లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని కొద్దిసేపు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఆలయ ఈఓ ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని, ఆ వివరాలు కూడా చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈఓ కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్
ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తనకు హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చింది. సీల్డ్ కవర్‌ను సబ్ ట్రెజరీలో భద్రపర్చాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో మైలవరం సబ్ ట్రెజరీ అధికారులకు దానిని గురువారం మునిసిపల్ కమిషనర్ అందజేశారు. విజయవాడ ఆర్డీఓ చైతన్య ఈ సీల్డ్ కవర్‌ను తెరిచి అందులో ఉన్న ఉత్తర్వుల మేరకు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. 2021 నవంబర్‌లో 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్ సీపీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 14 మంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఒకరు ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో వారి సంఖ్య 15కు చేరింది. అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటుతో వైఎస్సార్ సీపీ సంఖ్య కూడా 15 అయింది. అప్పటి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫీ షియో ఓటు కోసం కోర్టును ఆశ్రయించడంతో ఎన్నిక నిర్వహించి సీల్డ్‌కవర్ ద్వారా కోర్టుకు సమర్పించారు. ఇటీవల కాలంలో కేశినేని నాని కేసు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు సీల్డ్ కవర్‌లో వచ్చాయి.

నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు

నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు