
ఖరీఫ్ సాగుపై నీలినీడలు
నిధులు మంజూరు చేయని ప్రభుత్వం
గండ్లు పూడ్చకపోతే సాగు చేయలేం
వెల్లటూరు పడమర చెరువు కింద నాకు 2 ఎకరాల పొలం ఉంది. పోయిన సంవత్సరం ఖరీఫ్‌లో వరి సాగు చేశాను. చెరువుకు ఐదు చోట్ల గండ్లు పడి పైరు పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ఇప్పటివరకు గండ్లు పూడ్చలేదు. గండ్లు పూడ్చకపోతే పంట సాగు చేయలేం.
–మాదు నాగయ్య, రైతు, వెల్లటూరు
పులివాగు గండ్లతో తీవ్రంగా నష్టపోయాం
గత ఏడాది బుడమేరుకు వచ్చిన వరదలతో పులివాగు పొంగి గండ్లు పడ్డాయి. ఈ వరదల వలన నేను సాగు చేసిన నాలుగు ఎకరాల్లో వరిపైరు కుళ్లిపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు ఇప్పటివరకు పూడ్చలేదు. ఈ ఏడాది సాగు చేపట్టడం కూడా దండగ అనిపిస్తోంది. గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టలేం.
–బెజవాడ వీరయ్య, రైతు, కవులూరు
ఎనిమిది నెలలైనాగండ్లు పూడ్చలేదు
గత ఏడాది వరదల వలన పులివాగుకు గండ్లు పడి నేను సాగు చేసిన పది ఎకరాల్లో వరిపైరు పాడైపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు పడి ఎనిమిది నెలలు దాటినా గండ్లు పూడ్చకపోవడం దారుణం. ప్రభుత్వం వెంటనే గండ్లను పూడ్చాలి. లేదంటే ఈ ఏడాది సాగు చేపట్టడం కష్టమే.
–బొర్రా శ్రీనివాసరావు, రైతు, కవులూరు
కూటమి ప్రభుత్వానికి అమరావతి జపం తప్ప రాష్ట్రంలో రైతులు ఏమై పోయినా పట్టదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా దళారీల దోపిడీకి దారులు తెరుస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నా పట్టించుకోదు. బుడమేరు వరదలకు గండ్లు పడి ఎనిమిది నెలలైనా వాటిని పూడ్చాలనే ధ్యాసే ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 10 వేల హెక్టార్లలో సాగు ప్రశ్నార్థకం కానుంది.
జి.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది జల ప్రళయాన్ని సృష్టించిన బుడమేరు ప్రక్షాళన సంగతి దేవుడెరుగు కనీసం చెరువులకు, వాగులకు పడిన గండ్లను పూడ్చడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేపట్టాలో లేదో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు గండ్లతో పాటు పలు వాగులు, ఎన్‌ఎస్‌పీ కాల్వలకు పడిన గండ్లను అలానే వదిలేయడంతో మరో జల ప్రళయానికి ఆస్కారమిచ్చేలా ఉన్నాయి.
ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ...
బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు జి.కొండూరు మండల పరిధి కవులూరు శివారులో పడిన భారీ గండ్ల వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లు పూడ్చకపోతే తాము సాగు చేయలేమంటూ మొరపెట్టుకున్నారు. ఖరీఫ్ సాగు చేయమంటారా, వద్దంటారా అని మంత్రిని రైతులు పశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ దాటవేత ధోరణితో మాట్లాడారు. గండ్లు పూడ్చేందుకు ప్రతిపాదనలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, నిధులు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. లైనింగ్ పనులకు విడుదలైన నిధులనే ఆర్థికశాఖ రిజెక్ట్ చేస్తే సమస్య తీవ్రతను వివరించి నిధులు తెచ్చామంటూ గొప్పలు చెప్పారు. మంత్రి మాటలను విని నవ్వాలో, ఏడవాలో తెలి యని పరిస్థితిలో రైతులు ఉన్నారు. గండ్లు పూడ్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడమే మేలని భావిస్తున్నారు.ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే బుడమేరు వరద ముంపునకు గురైన పదివేల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం కానుంది.
వర్షాకాలం ముంచుకొస్తున్నా...
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షానికి బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో మైలవరం నియోజకవర్గంలో 34 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితో పాటు పులివాగు, కోతులవాగు, ఎన్‌ఎస్‌పీ కాల్వలకు సైతం గండ్లు పడి వేలాది ఎకరాల్లో ఖరీఫ్ పంటను రైతులు నష్టపోయారు. ఈ వరదల వలన చెరువులకు పడిన గండ్లను తాత్కాలికంగా కొన్ని చోట్ల పూడ్చినప్పటికీ కొన్ని చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లకు తట్ట మట్టి కూడా వేయలేదు. వేసవి కాలం పూర్తయి వర్షాకాలం వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా చోద్యం చూస్తుండడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
బుడమేరు గండ్లు పూడ్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతుల ఆందోళన గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టడం కూడా దండగేనంటున్న రైతులు గండ్లు పూడ్చాలంటూ ఇరిగేషన్ మంత్రికి మొరపెట్టుకున్న రైతులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన మంత్రి 10వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమే
క్రాప్ హాలిడే తప్పదా
బుడమేరు వరదల వలన వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు అంటే బుడమేరు ప్రారంభం వరకు వాగుకు ఇరువైపులా కట్టలకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు 65 పనులుగా నిర్థారించారు. ఈ పనులకు రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయలేదు. దీంతో పాటు చెరువులు, పులివాగు, కోతులవాగు, ఎన్‌ఎస్‌పీ కాల్వలకు పడిన గండ్లను శాశ్వతంగా పూడ్చేందుకు రూ.35 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు పంపినా నిధులను విడుదల చేయలేదు. కేవలం బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు కవులూరు గ్రామశివారులో పడిన భారీ గండ్ల వద్ద లైనింగ్ పనులు, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు మాత్రమే రూ.39.77 కోట్లు నిధుల విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు.

ఖరీఫ్ సాగుపై నీలినీడలు

ఖరీఫ్ సాగుపై నీలినీడలు

ఖరీఫ్ సాగుపై నీలినీడలు

ఖరీఫ్ సాగుపై నీలినీడలు

ఖరీఫ్ సాగుపై నీలినీడలు