
ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఎద్దేవా చేసింది. ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో 117 జీఓకు పూర్వం ఉండే పాఠశాల వ్యవస్థ విధానాలు కావాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. కూటమి ప్రభుత్వం విధానంతో ప్రభుత్వ పాఠశాలలు బలహీన పడతాయని ధ్వజమెత్తింది. ఈ ధర్నాను ప్రారంభించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ.. విద్యారంగాన్ని గాడిలో పెడతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రంగాన్ని మరింత గందరగోళంలోకి నెడుతోందన్నారు. దీనిని ఏపీటీఎఫ్ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం కేవలం 3, 4, 5, తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే... ఈ ప్రభుత్వం ఒకటి, రెండు తరగతులను కూడా విలీనం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరుతో, ఫౌండేషన్ పాఠశాలలను నెలకొల్పడం సరికాదన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్లను నియమించడం అశాసీ్త్రయమని విమర్శించారు. ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ విద్యారంగ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 12వ నేతన సవరణ కమిషన్ నియమించి 2023 జూలై నుంచి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ అమలు చేయాలని, ప్రభుత్వం ఉద్యోగులకు బాకీపడిన 34 డీఏలను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ప్రధాన సంపాదకుడు షేక్ జిలాని మాట్లాడుతూ.. విద్యారంగంలో విధ్వంస విధానాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పడం, పాఠశాలకు పాఠశాలకు మధ్య అనేక అంతరాలను సృష్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు ఎ.శ్యాంసుందరరెడ్డి, కె.అశోక్ కుమార్, టి.త్రినాథ, మర్రివాడ అనిత, పువ్వాడ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు డి.సరస్వతి, బి.ఎ.సాల్మన్‌రాజు, సయ్యద్ చాంద్‌బాషా, ఎన్.రవికుమార్, కె.శ్రీనివాసు, ఎం.శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వానికి ఏపీటీఎఫ్ సూటి ప్రశ్న

ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?