
ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మచిలీపట్నంలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లడానికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన 15 మంది ఆటోలో బయలుదేరారు. ఆ ఆటో తరకటూరుపాలెం దాటిన తర్వాత అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ తాడిశెట్టి శివరామప్రసాద్, పునుగుపాటి కోటేశ్వరమ్మ, పునుగుపాటి వెంకటేశ్వరమ్మ, మోచర్ల బ్లెస్సీ, కామరవపు శ్రీరష్మ, మోచర్ల సుజాత, రామకోటి ధనుష్, మోచర్ల జాయి, మోచర్ల వెంకటేశ్వరరావు తదితరులు గాయపడ్డారు. గూడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.