
రసవత్తరంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీపేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆరు పళ్ల విభాగం పోటీలను బుధవారం రాత్రి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వెంకటలక్ష్మీ సాయిబాబు ప్రారంభించారు. ఈ విభాగంలో 17 జతలు పాల్గొన్నాయని, 10.20 క్వింటాళ్ల బరువును 15 నిమిషాల వ్యవధిలో లాగిన దూరాన్ని బట్టి విజేతలను నిర్ణయిస్తామని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజ మానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
నగదు బహుమతుల అందజేత
మంగళవారం రాత్రి జరిగిన నాలుగు పళ్ల ఎడ్ల ప్రదర్శన పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎడ్ల జతల యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన గుదిబండ మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 4,750 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజారెడ్డి, కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన అనంతనేని శ్రీకన్యశ్రీమధు ఎడ్ల జత 4,702 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా యద్దన పూడికి చెందిన ఖాదర్ మస్తాన్, బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన ఏలూరి లిఖిత చౌదరి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామానికి చెందిన గడుపూడి సాంబశివరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం ఇస్సప్పాలేనికి చెందిన మందలపు వాసవికారెడ్డి, జశ్వితరెడ్డి ఎడ్ల జత 3,250.11 అడుగుల దూరం లాగి ఐదో స్థానం, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం రావిపాడుకు చెందిన యద్దనపల్లి పెద్దబ్బాయ్ బుజ్జి మెమోరియల్ మనోజ్ చౌదరి ఎడ్ల జత, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్, ప్రేమ్‌కుమార్ ఎడ్ల జత 3,221 అడుగుల దూరం లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేల నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు తెలిపారు.