
పెన్షన్ స్కీంలపై ముగిసిన అవగాహన సదస్సులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో విజయవాడ సంఘ్ కార్యాలయంలో మూడు రోజులపాటు యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీం), ఎన్‌పీఎస్ (న్యూ పెన్షన్ స్కీం), ఏపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) లపై నిర్వహించిన అవగాహన సదస్సులు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ్ సెంట్రల్ కమిటీ సభ్యుడు అల్లం రమేష్ మాట్లాడుతూ.. పెన్షన్ స్కీం ఎంపికలో ఉద్యోగులు అలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి ఫండ్ నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటే తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. సీనియర్ సెక్షన్ ఇంజినీర్లు రవికుమార్, నాగశయనలు మాట్లాడుతూ.. పాత పెన్షన్, నూతన పెన్షన్, యూనిఫైడ్ పెన్షన్ విధానాల్లోని తేడాలు, అందు లోని లాభనష్టాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. యూపీఎస్‌లో రూ.10 వేల కనీస పింఛన్ ఉంటుందని, కార్మికుడు రాజీనామా చేసిన లేదా ఏదైనా ఇతర కారణాల చేత సర్వీసు నుంచి వైదొలిగినా ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. పెన్షన్ ఎంపిక పూర్తిగా కార్మికుడి ఇష్టం పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్మికులు ఆలోచించి తగిన స్కీంను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కర్నూల్ సుకుమార్, ఇంజినీరింగ్ బ్రాంచ్ కార్యదర్శి ఎం.ఎస్.రావు, కార్యవర్గ సభ్యులు నవీన్, లాజరస్, మణికుమార్, బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.