భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో సస్పెండైన ఉద్యోగికి సంబంధించి విచారణ ఎట్టకేలకు మొదలైంది. విజయవాడ డివిజనల్ ఆఫీస్‌లో చోటు చేసుకున్న ఉద్యోగి రాసలీలల ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటికి పది రోజులు ముందుగానే ఘటనకు సంబంధించిన వీడియోలు ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు చేరినట్లు ప్రచారం జరిగింది. దాంతో నాలుక్కరుచుకున్న ఉన్నతాధికారులు ఈ నెల 4న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతరం వాటర్ ఫ్లీట్ జీఎం, ఓ అండ్ ఎం జీఎంలను విచారణ అధికారులుగా నియమించారు. ఈ నెల 12న డివిజనల్ ఆఫీస్‌లో ఇద్దరు అధికారులు విచారణ ప్రారంభించారు. సీసీ ఫుటేజి వీడియోల్లో రాసలీలలకు పాల్పడిన వ్యక్తి స్పష్టంగా కనబడుతుంటే ఇంక విచారణ ఎందుకు అన్నది ప్రశ్నార్థకం. విచారణ పేరుతో అమాయకులను బలి చేయడానికి చూస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఫుటేజి దొంగిలించిన వ్యక్తి తొలగింపు
సీసీ కెమెరాల ఫుటేజిని దొంగిలించిన వ్యక్తిని లెమన్ ట్రీ హోటల్ యాజమాన్యం తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. అతను లెమన్ ట్రీ హోటల్ కాంప్లెక్స్‌లోగల మెక్లైన్ కంపెనీ (హౌస్ కీపింగ్)లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ మధ్యాహ్నం నుంచి భవానీ ఐలాండ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతను దొంగిలించిన సీసీ ఫుటేజిని భవానీ ద్వీపంలో కీలక పదవిలో ఉన్న ఏపీటీడీసీ అధికారికి అందజేసినట్లు సమాచారం. మొత్తానికి ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయా, ఉద్యోగి సస్పెన్షన్‌తో సరిపెడతారా అన్నది వేచి చూడాల్సిందే.