
దుర్గమ్మ సన్నిధిలో మొరాయిస్తున్న స్టేర్ లిఫ్ట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సుమారు రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు స్టేర్ లిఫ్ట్ తరచూ మొరాయిస్తుండడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో చిన్న గాలి గోపురం సమీపంలోని మెట్లపై గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో స్టేర్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, వికలాంగులు స్టేర్ లిఫ్ట్‌ను సద్వినియోగం చేసుకుని స్కానింగ్ పాయింట్ వరకు చేరుకుంటున్నారు. అయితే ఈ లిఫ్ట్ తరచుగా మొరాయిస్తోంది. ప్రారంభించిన 7 నెలల కాలంలో ఎక్కువ సార్లు మరమ్మతులకు గురికావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ స్టేర్‌లిఫ్ట్ పని చేయకపోవడంతో ఘాట్‌రోడ్డు మీదగా వచ్చే పెద్ద వారు, వృద్ధులు, వికలాంగుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఘాట్‌రోడ్డు వైపు నుంచి వచ్చే వృద్ధులు, వికలాంగులు వీల్‌చైర్‌పై నేరుగా ఆలయ ప్రాంగణానికి చేరుకునే అవకాశం లేదు. గాలి గోపురం వద్దకు చేరుకున్న తర్వాత స్టేర్ లిఫ్ట్ ద్వారా కిందకు దిగి అక్కడి నుంచి ఆలయంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. స్టేర్ లిఫ్ట్‌ను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే అంటే గత ఏడాది నవంబర్ 8వ తేదీన మొదటిసారిగా నిలిచిపోవడంతో టెక్నికల్ సిబ్బంది మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఓ సారి ఈ స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడం పరిపాటిగా మారింది. లక్షలాది రూపాయల దేవస్థానం సొమ్ము వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ స్టేర్ లిఫ్ట్ ఇలా తరచూ మరమ్మతులకు గురికావడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది టెక్నీషియన్‌ను పిలిపించారు. ఆరు బయట వర్షం నీరు పడటంతో మోటరు పాడైపోయిందని చెప్పారు. అయితే స్టేర్ లిఫ్ట్‌కు ఏడాది పాటు వారంటీ ఉండటంతో కంపెనీనే పూర్తి బాధ్యత వహిస్తుందని చెబుతున్నా, ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది భక్తుల ప్రశ్న. అయితే ఈ స్టేర్ లిఫ్ట్ ఏర్పాటు చేసే సమయంలోనే మెట్లపై వర్షం నీరు పడకుండా షెడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇకనైనా స్టేర్ లిఫ్ట్ పూర్తి కాలం పని చేసేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు పేర్కొంటున్నారు.
వృద్ధులు, వికలాంగులకు తప్పని ఇక్కట్లు

దుర్గమ్మ సన్నిధిలో మొరాయిస్తున్న స్టేర్ లిఫ్ట్