
సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం
విజయవాడకల్చరల్: శ్రీ అన్నమయ్య సంకీర్తనా అకాడమీ( శ్వాస), కంచికామకోటి పీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నమయ్య జయంతి జాతీయ స్థాయి సంగీత కార్యక్రమాలు మధురంగా సాగుతున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంగీత విద్యాలయం విద్యార్థినులు, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థినులు, బంకుమల్లి విద్యాసాగర్, ధూళిపాళ వాసవి అన్నమయ్య రచించిన చక్కని తల్లికి చాంగ్‌భళా, పలుకుతేనియ తల్లిని, అదివో అల్లదివో శ్రీహరి వాసము, తందనానా ఆహి తందనానాతో పాటు అనేక సంకీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు. చివరిగా మల్లాది సోదరులు అన్నమయ్య పదానికి పట్టం కడుతూ సంకీర్తనలను గానం చేశారు. శ్వాస నిర్వాహకులు సత్యబాబు, ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కిడ్నీ రోగి మృతి
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని సుందరయ్య కాలనీకి చెందిన కిడ్నీరోగి మంగళగిరి దుర్గారావు (58) చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. టైలరింగ్ వృత్తి చేసి జీవించే దుర్గారావు మధుమేహం బారిన పడడంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. 2022 నవంబర్ నుంచి దుర్గారావు డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో తిరువూరు డయాలసిస్ కేంద్రానికి చికిత్స నిమిత్తం వెళ్లగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి దుర్గారావు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమార్తెకు, కుమారుడికి వివాహం చేశారు. మరో కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సుందరయ్య కాలనీలో గతంలో అల్లూరి నాగమణి కూడా కిడ్నీ వ్యాధి బారిన పడి మృతిచెందారు.
పలు కేసుల్లో నిందితునిపై పీడీ యాక్టు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయాలతో యువత ఆరోగ్యానికి భంగం కలిగించడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అక్బర్ బాషాపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించింది. విద్యాధరపురానికి చెందిన అక్బర్ బాషాపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్‌లలో 35 కేసులు ఉన్నాయి. వీటిలో 5 గంజాయి కేసులు, 30 దొంగతనం, దోపీడీ కేసులు నమోదయ్యాయి. భవానీపురం స్టేషన్‌లోనే 4 గంజాయి కేసులు, 5 దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బెయిల్‌పై విడుదల అయి వచ్చి తిరిగి గంజాయి విక్రయాలు, దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండడంతో ప్రభుత్వం అక్బర్‌బాషాపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్బర్ బాషాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.

సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం