
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితుల అరెస్ట్
కోనేరుసెంటర్/బంటుమిల్లి: బంటుమిల్లిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులను బంటుమిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బందరు డీఎస్పీ సీహెచ్ రాజ మచిలీపట్నంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.నాగరాజు గత వారం విధి నిర్వహణలో భాగంగా గుడివాడ డిపో నుంచి బస్సు తీసుకుని సరిగ్గా బంటుమిల్లి సెంటర్‌కు రాగానే ఎదురుగా బైక్‌లు అడ్డు రావటంతో హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన సోమిశెట్టి వెంకటనారాయణ, రాఘవరపు సతీష్, దాసు శ్రీనివాసు మద్యం మత్తులో డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. వీరి దాడిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న మహిళా కండక్టర్‌పై కూడా దురుసుగా వ్యవహరించారు. బాధితుడు నాగ రాజు అదే రోజు బంటుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టుకు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. రూరల్ సీఐ, బంటుమిల్లి ఎస్‌ఐ పాల్గొన్నారు.