
రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో అధిక ధరలు, అనధికారిక విక్రయాలపై కమర్షియల్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి స్టేషన్‌లోని క్యాటరింగ్ స్టాల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు పర్యవేక్షణలో కమర్షియల్ అధికారులు, సిబ్బందితో స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలలో క్యాటరింగ్ స్టాల్స్ అనుమతులు, విక్రయాలు సాగిస్తున్న వెండర్స్ ఐడీ కార్డులు, పర్మిట్‌లను తనిఖీల చేశారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న స్టాల్స్ నిర్వాహకులు, గుర్తింపు లేని, గడువు ముగిసిన ఐడీ కార్డులు, పర్మిట్ కార్డులు లేకుండా అనధికారిక విక్రయాలు సాగిస్తున్న 17 మందిని అదుపులోకి తీసుకుని రూ. 85 వేలు జరిమానా వసూలు చేశారు.
ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
రైలు ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు విజయవాడ డివిజన్ అధిక ప్రాధాన్యమిస్తోందని, వారికి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం విక్రయించేలా స్టాల్స్, వెండర్స్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు సీనియర్ డీసీఎం రాంబాబు పేర్కొన్నారు. స్టేషన్‌లో అనధికార హాకర్లు, విక్రేతలను నివారించడానికి క్రమంతప్పకుండా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేయకూడదని, సరైన పర్మిట్లు ఉన్న వెండర్స్ మాత్రమే విక్రయించాలని, స్టాల్స్ నిర్వాహకులు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే విక్రయించుకోవాలని ఆయన సూచించారు.
అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద రీతిలో ఇన్నర్ రింగ్ రోడ్డులోని పొలాల్లో శవమై కనిపించాడు. ఘటనపై మృతుని అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదలకు చెందిన వీరబత్తిన వెంకటరావు(45) వెల్డర్. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటరావు సాయంత్రమైనా తిరిగి రాలేదు. సోమవారం ఉదయం వైవీరావు ఎస్టేట్ నుంచి పైపుల రోడ్డు మధ్య ఉన్న ఇన్నర్‌రింగ్ రోడ్డులోని ఖాళీ స్థలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు వెంకటరావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్క నక్షత్ర ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి డ్రైవర్ మృతి
గూడూరు: మట్టి ట్రాక్టర్‌పై నుంచి జారిపడిన డ్రైవర్ మరణించిన ఘటన సోమవారం మండల పరిధిలోని మల్లవోలులో చోటు చేసుకుంది. మల్లవోలు శివారు ముదిరాజుపాలెం గరువుకు చెందిన పూల నరసింహ(25) ట్రాక్టర్ డ్రైవర్. వారం రోజులుగా రాయవరం పొలిమేర నుంచి చటారిపాలెంకు ట్రాక్టర్లతో మట్టి తోలకానికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం చటారిపాలెం మట్టి డంప్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌పై నుంచి జారి పడిపోయాడు. అతని నడుంపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. నరసింహను తొక్కుకుంటూ వెళ్లిన ట్రాక్టరు చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు నరసింహ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే పూల శ్రీనుకు ఇద్దరు కుమారులు వారిలో నరసింహ పెద్దవాడు. తన కుమారుడికి పెళ్లి కూడా కాలేదంటూ.. అతను దుర్మరణం చెందడంపై శ్రీను కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
‘క్యాటరింగ్ స్టాల్స్’ అనధికార విక్రేతలకు
రూ. 85 వేలు జరిమానా

రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు