
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూలతో అలంకరించిన వాహనాన్ని అధిష్టించిన ఉత్సవమూర్తులకు ఈవో శీనానాయక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రచార రథంతో పాటు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనం ముందుకు సాగింది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల కోలాటనృత్యాలు, డప్పుకళాకారులు విన్యాసాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణవీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరింది. ఆది దంపతులకు పసుపు, కుంకుమ, పూజా సామగ్రి సమర్పించి తమ కుటుంబాలు చల్లగా ఉండాలని వేడుకున్నారు.
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం
పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు స్వర్ణకవచాన్ని అలంకరించారు. స్వర్ణకవచంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున అమ్మవారికి స్వర్ణకవచం అలంకరిస్తారు.

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ