
బైక్ దొంగల అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 20లక్షల నగదు, 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలోని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు. వెస్ట్ ఏసీపీ దుర్గారావు పర్యవేక్షణలో సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని అనుమానితులు, పాత నేరస్తులపై నిఘా ఉంచారు. హెచ్‌బీ కాలనీకి చెందిన గడ్డం శరణ్‌సాయి, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం డోలాస్ నగర్‌కు చెందిన బొక్కా కార్తీక్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గొల్లపూడిలోని అట్కిన్‌సన్ స్కూల్ సమీపంలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు పంపారు.
రూ. 20 లక్షల నగదు, 11 బైక్‌లు స్వాధీనం